పెట్టుబడి రావడం లేదు
కరప మండలం పెదకొత్తూరుకు చెందిన కౌలు రైతు కర్రి ప్రసాద్ వాకాడ గ్రామంలో ఓ రైతు నుంచి మూడెకరాలు కౌలుకు తీసుకున్నారు. ఖరీఫ్, రబీ పంటకు కలిపి ఎకరాకు 25 బస్తాల కౌలు ఇవ్వాలనేది ఒప్పందం. మోంథా తుపాను రావడానికి ముందే ఎకరాకు రూ.35 వేల వరకూ పెట్టుబడి అయ్యింది. చివరిలో తుపాను విరుచుకుపడటంతో పంట ఒక్కసారిగా నేలనంటేసింది. పెట్టిన పెట్టుబడి కాస్తా ముంపులో కొట్టుకుపోయింది. గింజ సరిగా తోడుకోక మడంపొల్లు వచ్చింది. దిగుబడి ఎకరానికి 8 నుంచి 10 బస్తాల వరకూ తగ్గిపోయింది. వచ్చిన ధాన్యం రంగు మారిపోయింది. యంత్రంతో ఎకరం చేను కోసేందుకు గంట సమయం పట్టేది. పంట పడిపోవడంతో రెండు గంటలు పట్టింది. ఫలితంగా ఎకరాకు మరో రూ.3,200 చొప్పున అదనపు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. పంట కోయించి, లే అవుట్‌లోకి ధాన్యం తీసుకొచ్చి, ఆరబెట్టేందుకు ఎకరాకు మరో రూ.12 వేల నుంచి రూ.15 వేలు అయ్యింది. ఈ విధంగా విత్తనాలు, దమ్ములు, వరి నాట్లు, కలుపుతీత, పురుగుమందులు, ఎరువులు, మాసూళ్లకు కలిపి ఎకరాకు సుమారు రూ.45 వేల వరకూ ఖర్చయ్యింది. కూలి ఖర్చులు మరో రూ.10 వేలు. ఇంత పెట్టుబడి పెడితే ఇప్పుడు ఎకరాకు 20 నుంచి 25 బస్తాలకు మించి దిగుబడి రావడం లేదని ప్రసాద్ ఆవేదన చెందుతున్నారు. పెట్టుబడుల మాట దేవుడెరుగు.. కౌలు తీసేయగా కనీసం కోతలు, నూర్పిడి ఖర్చు కూడా రావడం లేదని కన్నీటిపర్యంతమవుతున్నారు.
పెద కొత్తూరు లే అవుట్‌లో ఆరబెట్టిన ధాన్యం


