మత్తుకు బానిసలు కావద్దు
రాజానగరం: జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, ఎంచుకున్న లక్ష్యాలను సాధించాలనే తపనతో ముందుకు సాగాలే తప్ప మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోరాదని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ హితవు పలికారు. జిల్లా వృద్ధులు, దివ్యాంగులు, ట్రాంజెండర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యాన నషా ముక్త్ భారత్ అభియాన్ వార్షికోత్సవం వర్సిటీలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ, గంజాయి, డ్రగ్స్, మద్యం వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి, ఎంచుకున్న లక్ష్యాలకు దూరం కారాదని విద్యార్థులకు హితవు పలికారు. అడిషనల్ ఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ మేరకు అందరూ కలిసి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, డీన్ ఎన్.ఉదయ్ భాస్కర్, సుందర్‌రాజు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


