టెన్త్‌షన్‌ | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌షన్‌

Nov 18 2025 6:09 AM | Updated on Nov 18 2025 6:09 AM

టెన్త

టెన్త్‌షన్‌

మంగళవారం శ్రీ 18 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

పబ్లిక్‌ పరీక్ష ఫీజు పేరుతో అదనపు వసూళ్లు

ఆందోళన చెందుతున్న విద్యార్థుల

తల్లిదండ్రులు

ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్ల యాజమాన్యాల ఇష్టారాజ్యం

నిర్దేశిత రుసుము కంటే అధికంగా వసూలు చేస్తూ రసీదులు ఇవ్వని వైనం

పట్టించుకోని విద్యా శాఖ అధికారులు

బాలాజీచెరువు (కాకినాడ సిటీ):

● కాకినాడ శ్రీరామ్‌నగర్‌ కాలనీలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో సునీల్‌ పదో తరగతి చదువుతున్నాడు. పబ్లిక్‌ పరీక్ష ఫీజు చెల్లించాలని స్కూల్‌ యాజమాన్యం చెప్పడంతో.. ఆ విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి రూ.125 ఇచ్చారు. పాఠశాల అకౌంటెంట్‌ అది కుదరదంటూ రూ.వెయ్యి వసూలు చేశారు. రసీదు అడిగితే లేదని సమాధానమిచ్చారు.

● కాకినాడ నాగమల్లి తోట జంక్షన్‌లోని ఓ కార్పొరేట్‌ పాఠశాలలో ఓ చిరుద్యోగి కొడుకు శ్రీకాంత్‌ పదో తరగతి చదువుతున్నాడు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు వచ్చిన ఆ విద్యార్థి తల్లిదండ్రుల నుంచి పాఠశాల సిబ్బంది రూ.వెయ్యి వసూలు చేశారు. ఫీజు రూ.125 కదా అని అడగ్గా, ఫీజుతో పాటు ఖర్చులుంటాయని అకౌంటెంట్‌ చెప్పినట్లు వారు వాపోయారు.

● జిల్లాలో ఈ రెండు స్కూళ్లలోనే కాదు. దాదాపు అన్ని కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలల్లో విద్యా శాఖ నిర్ణయించిన ఫీజు కంటే అదనంగా పదో తరగతి విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారు. రూ.125 పరీక్ష ఫీజు అయితే, అదనంగా రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు దండుకుంటున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ అదనపు దోపిడీపై విద్యా శాఖ అధికారులు తనిఖీలు చేసి, చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు, విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. జిల్లాలో మొత్తం 219 ప్రైవేట్‌, 247 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో 29,866 వేల మంది విద్యార్థులు పది పబ్లిక్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.

అడిగేవారేరీ..?

జిల్లాలో వివిధ యాజమాన్యాలకు చెందిన ఉన్నత పాఠశాలలు 466 ఉన్నాయి. ఇందులో 219 కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలలున్నాయి. ఆయా విద్యాసంస్థల్లో పబ్లిక్‌ పరీక్షలకు అన్ని యాజమన్యాల నుంచి 29,866 మంది హాజరవుతుండగా, వీరిలో ప్రైవేట్‌ విద్యార్థులు 19,500 వరకూ ఉన్నారు. వారి తల్లిదండ్రులు పరీక్షల ఫీజు రూ.125 చెల్లించేందుకు పాఠశాలలకు వెళితే, అదనపు సొమ్ము డిమాండ్‌ చేస్తున్నారు. ఒక్కొక్క విద్యార్థి నుంచి చేస్తున్న అదనపు వసూళ్లు రూ.800 చొప్పున లెక్కించినా.. కనీసం రూ.1.60 కోట్లు అవుతోంది. ప్రభుత్వ రుసుము మాత్రమే చెల్లిస్తామని చెబితే, అదనపు ఖర్చులుంటాయని ఆయా స్కూళ్ల హెచ్‌ఎంలు చెబుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. అడిగిన మేరకు ఇవ్వని తల్లిదండ్రుల పిల్లలకు ఏదో ఓ సాకు పెట్టి, తోటి విద్యార్థుల ఎదుట అవమానాలకు గురి చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని కొంత మంది తల్లిదండ్రులు మండల విద్యా శాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వారు ‘చూస్తాం.. చేస్తాం’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నట్టు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్‌ పరీక్ష ఫీజులకు రసీదులు ఇవ్వకుండా ఇష్టానుసారం దోచుకుంటున్నారని వారు మండిపడుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో అదనపు వసూళ్లు చేస్తుంటే, చర్యలు చేపట్టాల్సిన విద్యా శాఖాధికారులు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారో అర్ధం కావడం లేదంటున్నారు. ప్రత్యేక బృందాలను నియమించి అదనపు వసూళ్లకు పాల్పడుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులతో పాటు, విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

అధికారులు

చర్యలు తీసుకోవాలి

జిల్లాలోని ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు అటు స్కూల్‌ ఫీజులు, ఇటు పబ్లిక్‌ పరీక్షల్లోనూ ఇష్టానుసారం దోచుకుంటున్నారు. పదో తరగతి విద్యార్థుల నుంచి పబ్లిక్‌ పరీక్ష ఫీజు రూ.125 మాత్రమే వసూలు చేయాలి. అంతకంటే ఎక్కువగా ఒక్క రూపాయి కూడా విద్యార్థుల నుంచి తీసుకోకూడదు. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో అదనంగా రూ.వెయ్యి వరకు ఫీజులు దోచేస్తున్నారని తెలిసింది. విద్యా శాఖ అధికారులు తనిఖీ చేసి చర్యలు చేపట్టాలి.

– బి.సిద్దూ, రాష్ట్ర సహాయ కార్యదర్శి,

పీడీఎస్‌యూ

ప్రభుత్వ రుసుమే చెల్లించాలి

పదో తరగతి పరీక్ష ఫీజు ప్రభుత్వ రుసుము మాత్రమే చెల్లించాలి. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాల మేరకు పరీక్ష ఫీజు చెల్లింపునకు స్పష్టమైన ప్రకటన విడుదల చేశాం. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధికంగా ఫీజు వసూలు చేస్తే మాకు సమాచారం ఇవ్వవచ్చు.

– పిల్లి రమేష్‌,

డీఈఓ, కాకినాడ

ప్రభుత్వం నిర్దేశించిన పబ్లిక్‌ పరీక్ష ఫీజులిలా..

రెగ్యులర్‌ విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు రూ.125

మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు రూ.125

మూడు కన్నా తక్కువ సబ్జెక్టులు రూ.110

ఒకేషనల్‌ విద్యార్థులు

రెగ్యులర్‌ ఫీజుతో అదనంగా రూ.60

అండర్‌ఏజ్‌ విద్యార్థులకు రూ.300

ఫీజుల ప్రక్రియ మొదలు

వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఫీజుల చెల్లింపు ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు రూ.125 చెల్లించాలని విద్యా శాఖ ప్రకటించింది. పాఠశాల యాజమాన్యాలు అదనంగా ఫీజులు వసూలు చేస్తే చర్యలుంటాయని ఆదేశాల్లో స్పష్టంచేసింది.

నిర్దేశిత ఫీజు కంటే అదనంగా వసూలు చేయరాదని స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ, అవి ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు ఇష్టానుసారంగా అదనంగా పబ్లిక్‌ పరీక్ష ఫీజు పేరుతో దోచేస్తున్నారు. ఈ విషయాన్ని విద్యా శాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. చర్యలు శూన్యమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టెన్త్‌షన్‌1
1/2

టెన్త్‌షన్‌

టెన్త్‌షన్‌2
2/2

టెన్త్‌షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement