రత్నగిరిపై కార్తిక శోభ
● ఆఖరి సోమవారం కిక్కిరిసిన సత్యదేవుని ఆలయం
● స్వామిని దర్శించిన 90 వేల మంది భక్తులు
● తొమ్మిది వేల వ్రతాలు, రూ.కోటి ఆదాయం
అన్నవరం: అత్యంత పవిత్రమైన కార్తిక సోమవారం పర్వదినం సందర్భంగా రత్నగిరి సత్యదేవుని ఆలయం వేలాది భక్తులతో పోటెత్తింది. సోమవారం వేకువజామున ఒంటి గంట నుంచి సాయంత్రం వరకూ ఆలయ ప్రాంగణంలో భక్తజన సందోహం నెలకొంది. సుమారు 90 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించారు. రికార్డు స్థాయిలో తొమ్మిది వేల సత్యదేవుని వ్రతాలు జరిగాయి. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.కోటి ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. శనివారం ఏకాదశి సందర్భంగా 1.20 లక్షల మంది, ఆదివారం 1.10 లక్షల మంది భక్తులు విచ్చేసిన విషయం తెలిసిందే. కార్తిక మాసం చివరి సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని ఊహించిన అధికారులు ఆలయాన్ని వేకువజామున ఒంటి గంటకు తెరిచి భక్తులను అనుమతించారు. వ్రత మండపాలు, నిత్య కల్యాణ మండపం, పాత కల్యాణ మండపాలు వ్రతాలాచరించే భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ కారణంగా స్వామివారి అంతరాలయ దర్శనం, యంత్రాలయ దర్శనాలను నిలిపివేశారు. భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ, తూర్పు రాజగోపురం ఎదురుగా రావి చెట్టు వద్ద పూజలు చేశారు. ఆలయ ప్రాంగణమంతా దీపాలతో నిండిపోయింది. కార్తిక మాసంలో ముఖ్యమైన పర్వదినాలు ముగియడంతో సత్యదేవుని సన్నిధిన రద్దీ కూడా తగ్గనుంది. మూడు రోజుల్లో లక్షల మంది భక్తులు విచ్చేసినా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాఫీగా సాగడంతో దేవస్థానం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
1,26,330కు చేరిన వ్రతాలు
కార్తిక మాసంలో సత్యదేవుని వ్రతాలు గతేడాదికి చేరువలో ఉన్నాయి. సోమవారం జరిగిన తొమ్మిది వేల వ్రతాలతో కలిపి మొత్తం 1,26,330 వ్రతాలు జరిగాయి. గతేడాది కార్తిక మాసంలో 1,47,142 వ్రతాలు జరిగాయి. సోమవారం దేవస్థానానికి రూ.కోటి ఆదాయం వచ్చింది. సత్యదేవుని వ్రతాల్లో దాదాపు 70 శాతం రూ.300 టిక్కెట్‌తో జరిగినవే. రూ.వెయ్యి వ్రతాలు 847, రూ.1,500 వ్రతాలు 462, రూ.రెండు వేల వ్రతాలు 577 జరిగాయి. వ్రతాల ద్వారానే సుమారు రూ.45 లక్షల ఆదాయం సమకూరగా, ప్రసాదం విక్రయాల ద్వారా రూ.40 లక్షల ఆదాయం వచ్చింది. మిగిలిన విభాగాల ద్వారా రూ.15 లక్షలు సమకూరింది. పది వేల మందికి పులిహోర, దద్దోజనం పంపిణీ చేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
పంచారామ క్షేత్రం.. శివనామ స్మరణం
సామర్లకోట: బాలాత్రిపుర సుందరి సమేత కుమారారామ భీమేశ్వరస్వామి వేంచేసిన సామర్లకోట పంచారామ క్షేత్రం భక్తజనుల శివనామ స్మరణతో మార్మోగింది. కార్తిక మాసం చివరి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఉచిత, రూ.20, రూ.50 రూ.100 క్యూల్లో భక్తులు బారులు తీరారు. ఈఓ భళ్ల నీలకంఠం ఆధ్వర్యంలో తెల్లవారుజాము మూడు గంటలకు గోపూజ, అనంతరం స్వామివారికి తొలి అభిషేకం, తొలి పూజలు జరిగాయి. ఈఓతో పాటు, ఉత్సవాల ప్రత్యేకాధికారి సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో ఆలయ పండితులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. తెల్లవారుజామున, రాత్రి భక్తులు వెలిగించిన దీపాలతో ఆలయం ప్రజ్వరిల్లింది. ఆలయ కోనేరులో, గోదావరి కాలువలో భక్తులు పుణ్యస్నానాలు చేసి, దర్శనాల కోసం ఆలయానికి తరలివచ్చారు.
రత్నగిరిపై కార్తిక శోభ
రత్నగిరిపై కార్తిక శోభ


