దౌర్జన్యాలకు పరాకాష్ట
ధర్నాను ఉద్ధేశించి మాట్లాడుతున్న
మాజీ మంత్రి దాడిశెట్టి రాజా.
చిత్రంలో పార్టీ నేతలు
● చంద్రబాబు సర్కార్‌పై సమర శంఖం
● హిందూపురం ఘటనపై నిరసన
● బాలాజీ చెరువు సెంటర్‌లో
వైఎస్సార్ సీపీ నేతల ధర్నా
● నిప్పులు చెరిగిన మాజీ మంత్రి రాజా, మాజీ ఎంపీ గీత
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో దౌర్జన్యాలు పరాకాష్టకు చేరుకున్నాయి. వ్యక్తులు, వ్యవస్థలపై దాడులకు తెగబడుతూ సొంత జిల్లాలో అడుగుపెట్టాలంటే వీసా తీసుకోవాలనే పరిస్థితికి చేరుకున్నాయని వైఎస్సార్ సీపీ శ్రేణులు మండిపడ్డాయి. హిందూపురంలో వైఎస్సార్ సీపీ కార్యాలయంపై టీడీపీ మూకలు చేసిన దాడి, దౌర్జన్యాలపై కాకినాడలో వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్దఎత్తున నినదించాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన పార్టీ నేతలు కాకినాడ బాలాజీచెరువు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. సెంటర్‌లో మహానేత వైఎస్సార్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులు చంద్రబాబు ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై నిరసన వ్యక్తం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు మెడలో నల్ల కండువాలు వేసుకుని చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ, అసలు రాష్ట్రంలో పరిపాలన అంటూ ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. చంద్రబాబు గద్దె ఎక్కిన దగ్గర నుంచి రెడ్‌బుక్ పాలన నడుస్తూ, దౌర్జన్యాలు, అక్రమాలకు కేరాఫ్‌గా నిలిచిందని ప్రజలు ఏవగించుకుంటున్నార ని విమర్శించారు. చంద్రబాబు పాలన చూస్తుంటే పాకిస్తాన్‌లో ఉన్నామనే భావన కలుగుతోందన్నారు. గతంలో బీహార్‌లో జంగిల్ రాజ్‌గా లాలూప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులను ప్రోత్సహించి జరిపిన అరాచకాలు, దోపిడీలతో ప్రజలు విసుగెత్తిపోయి ఇటీవల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిందన్నారు. ఇక్క డా అదే తరహాలో నడుస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసే సమయం దగ్గర్లోనే ఉందన్నారు. పార్టీ కార్యాలయంపై దాడి చేసి, కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడితే పార్టీ నేతలు పలకరించేందుకు వెళ్లే స్వేచ్ఛ కూడా ఈ రాష్ట్రంలో లేదా అని ప్రశ్నించారు. పార్టీ నేతల కోసం హిందూపురం వెళ్లాలంటే పాస్‌పోర్టు కావాలని అడిగే దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో దిగజారుతున్న ఆర్థి క పరిస్థితులు చూస్తుంటే మరో సూడాన్ అయిపోతుందనే భయం కలుగుతోందన్నారు. మాజీ మంత్రి, పార్టీ జగ్గంపేట కో–ఆర్డినేటర్ తోట నరసింహం మాట్లాడుతూ, హిందుపురంలో పార్టీ కార్యాలయం ధ్వంసం, పార్టీ కార్యకర్తలపై దాడులకు తెగబడటం అన్యాయమన్నారు. అధికార పార్టీ ప్రజలకిచ్చిన హామీల అమలు కోసం కృషి చేయాలని హితవు పలికారు.


