దత్తత విషయంలో దళారులను నమ్మవద్దు
కలెక్టర్ షణ్మోహన్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని దత్తత విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ హెచ్చరించారు. దత్తత అవగాహన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ, చట్టబద్ధంగా దత్తత తీసుకోవడం శ్రేయస్కరమన్నారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా దత్తత తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. దత్తతలో ఉండే వివిధ రకాల వెసులుబాట్లు.. రిలేటివ్ అడాప్షన్ (రక్త సంబంధీకుల దత్తత), స్టెప్ పేరెంటెడ్ ఆడాప్షన్ తదితర అంశాలపై అవగాహన కల్పించాలని జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బందికి సూచించారు. ఈ నెలలో గ్రామ, మండల, డివిజనల్ స్థాయిలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా దత్తత ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ పీడీ చెరుకూరి లక్ష్మి మాట్లాడుతూ, ఎవరైనా పిల్లలను దత్తత తీసుకోవాలంటే జిల్లా బాలల పరిరక్షణ విభాగం, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికార్లను సంప్రదించాలన్నారు. దత్తత తీసుకునే వారు 85550 60818, 63035 99264, 93925 00795 నంబర్లలో సంప్రదించాలన్నారు.
భూముల బదిలీ ప్రక్రియ వేగవంతం చేయాలి
కాకినాడ ఎస్‌ఈజెడ్ భూములు రైతుల పేరున బదిలీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియపై సోమవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ, కేఎస్‌ఈజెడ్, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కాకినాడ జిల్లాలో యు.కొత్తపల్లి, తొండంగి మండలాల్లో ఎస్‌ఈజెడ్ లిమిటెడ్ ద్వారా 1,189 ఎకరాల భూమిని 1,545 మంది రైతులకు బదిలీ చేయాల్సి ఉందన్నారు. ఆయా భూములకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ పత్రాలపై స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు పూర్తిగా మినహాయించినట్టు చెప్పారు. భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో కాకినాడ, పెద్దాపురం ఆర్డీవోలు ఎస్.మల్లిబాబు, కె.శ్రీరమణి, జిల్లా రిజిస్ట్రార్ జయలక్ష్మి, పాడా పీడీ చైత్రవర్షిణి, కాకినాడ సెజ్ జీఎం ఎం.శ్రీనివాసు పాల్గొన్నారు.


