తొందారిగా సాగేందుకు..
● తుది దశకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే పనులు
● ఖమ్మం నుంచి దేవరపల్లి వరకూ నిర్మాణం
● తగ్గనున్న 70 కిలోమీటర్ల దూరం
● రూ.4,200 కోట్ల అంచనా వ్యయం
దేవరపల్లి: ఉభయ తెలుగు రాష్ట్రాలను అనుసంధానిస్తూ.. పచ్చని పంట పొలాల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు తుది దశకు చేరుకున్నారు. మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి రానుంది. న్యాయపరమైన చిక్కులు తొలగడంతో కొయ్యలగూడెం మండలం పొంగుటూరు వద్ద మూడు కిలోమీటర్ల రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చి నాటికి పనులు పూర్తి చేసి వాహన రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నట్టు అధికారులు వెల్లడించారు. గ్రామాలను తాకకుండా ఈ హైవే నిర్మాణం చేపడుతున్నారు. ఇది పూర్తయితే ఉత్తరాంధ్ర నుంచి తెలంగాణకు రవాణా సదుపాయం మెరుగుపడడంతో పాటు సమయం, దూరం తగ్గుతుంది. సుమారు 162 కిలోమీటర్ల పొడవున ఖమ్మం నుంచి దేవరపల్లి వరకూ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతుంది. దీనివల్ల దేవరపల్లి నుంచి ఖమ్మంకు సుమారు 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని అధికారుల అంచనా. రహదారికి ఇరువైపులా సర్వీసు రోడ్లు లేకుండా నాలుగు వరుసల హైవే నిర్మాణం జరుగుతుంది. 2022 ఏప్రిల్‌లో గ్రీన్‌ఫీల్డ్ హైవేకు అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్గరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. నిబంధనల ప్రకారం 2024 సెప్టెంబర్‌కు మూడేళ్లలో హైవే నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. అయితే అధిక వర్షాలు, తుపాన్లు, కొన్ని ప్రాంతాల్లో న్యాయపరమైన చిక్కుల కారణంగా జాప్యం జరిగిందని అధికారులు చెబుతున్నారు.
ఐదు ప్యాకేజీలుగా..
ఖమ్మం నుంచి దేవరపల్లి వరకూ సుమారు 162 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ మంత్రిత్వ శాఖ రూ.4,200 కోట్లు మంజూరు చేసింది. ఐదు ప్యాకేజీల్లో పనులు చేపట్టగా, తెలంగాణలో మూడు, ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్యాకేజీల్లో జరిగాయి. అయితే 5వ ప్యాకేజీలో పొంగుటూరు వద్ద మూడు కిలోమీటర్ల రహదారి పనులు మాత్రమే జరగాల్సి ఉంది. గ్రీన్‌ఫీల్డ్ హైవే దేవరపల్లి డైమండ్ జంక్షన్‌కు రెండు కిలోమీటర్ల సమీపంలో గుండుగొలను – కొవ్వూరు జాతీయ రహదారి (16) కలుస్తుంది. ఈ ప్రాంతంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో డ్రమ్‌ఫుట్ నిర్మించారు. అయితే నాలుగు వరుసలుగా నిర్మిస్తున్న రహదారికి సుమారు 1,100 ఎకరాలు ప్రభుత్వం సేకరించింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ సహకారంతో కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్మాణ పనులు చేపట్టింది.
ఇలా వెళ్తే దగ్గరే..
గ్రీన్‌ఫీల్డ్ హైవే ద్వారా విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వెళ్లేవారికి దూరం తగ్గుతుంది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు విజయవాడ మీదుగా కాకుండా నేరుగా దేవరపల్లి నుంచి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేపై రయ్ రయ్ మంటూ ఖమ్మం నుంచి గమ్యస్థానాన్ని చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల దూరం తగ్గుంతుందని అంటున్నారు.
మలుపులు లేకుండా..
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 72 కిలోమీటర్ల రహదారిని రూ.2,200 కోట్లతో చేపట్టారు. చింతలపూడి సమీపంలోని రేచర్ల వద్ద నుంచి హైవే పనులు ప్రారంభమవుతాయి. ఖమ్మం నుంచి దేవరపల్లి మధ్య ఎనిమిది టోల్ ప్లాజాలు, 51 మైనర్, 9 మేజర్ బ్రిడ్జిలు నిర్మించారు. హైవే నిర్మాణంతో దేవరపల్లి – హైదరాబాద్ మధ్య దూరం సుమారు 70 కిలోమీటర్లు తగ్గుతుంది. రహదారి పూర్తిగా పంట పొలాల మధ్య నుంచి వెళుతుంది. మలుపులు లేకుండా సమాంతరంగా ఉంటుంది.
మెరుగుపడనున్న రవాణా వ్యవస్థ
మెట్ట ప్రాంతంలో తల్లాడ – దేవరపల్లి(316డీ), గుండుగొలను – కొవ్వూరు (ఎన్‌హెచ్ 16), ఖమ్మం – దేవరపల్లి మూడు నేషనల్ హైవేల ఏర్పాటుతో వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. పండించిన పంటలను దూర ప్రాంతాల్లోని మార్కెట్లకు రవాణా చేయడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్, విశాఖ, కోల్‌కతా, విజయనగరం వంటి ప్రాంతాలకు వ్యవసాయ ఉత్పత్తులను రైతులు రవాణా చేస్తున్నారు. ఎక్కువగా నిమ్మ, అరటి, కోకో, జీడిగింజలు వంటివి రవాణా జరుగుతుంది. తద్వారా పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందనుంది.
పనులు ముమ్మరం చేశాం
గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. నాలుగు ప్యాకేజీల్లో పనులు పూర్తికాగా, 5వ ప్యాకేజీలో మూడు కిలోమీటర్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చి నాటికి పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నాం. ఈ హైవేతో హైదరాబాద్‌కు సుమారు 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. భూసేకరణకు ఎదురైన న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో పనులు ముమ్మరం చేశాం. దేవరపల్లి వద్ద టోల్‌ప్లాజా నిర్మాణం పూర్తయ్యింది. దేవరపల్లి వద్ద డ్రమ్‌ఫుట్ నిర్మాణం పూర్తి చేశాం. ఇక్కడ రెండు జాతీయ రహదారులు కలుస్తాయి.
– బి.కృష్ణమూర్తి, పీడీ, నేషనల్ హైవేస్,
రాజమహేంద్రవరం
తొందారిగా సాగేందుకు..
తొందారిగా సాగేందుకు..


