వైద్యుడిపై దోపిడీ దొంగల దాష్టీకం
● పోలీసులమని చెప్పి బెదిరింపు
● ఏటీఎంలకు తిప్పి డబ్బు డ్రా చేసి ఇవ్వాలని దాడి
కాకినాడ క్రైం: కాకినాడలో శాంతిభద్రతల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. నగరంలో అర్ధరాత్రి దాటితే మగవారే నిర్భయంగా తిరగలేని పరిస్థితి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాకు చెందిన 29 ఏళ్ల డాక్టర్ రవి జైశ్వాల్ స్థానిక రంగరాయ వైద్య కళాశాలలో ఈఎన్‌టీ పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. స్థానిక సుబ్బయ్య హోటల్ సమీపంలో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఆదివారం అర్ధరాత్రి దాటాక రాత్రి ఒంటి గంట సమయంలో డ్యూటీ ముగించుకుని జీజీహెచ్ నుంచి ద్విచక్ర వాహనంపై తన రూమ్‌కు వెళుతుండగా, గుర్తు తెలియని ముగ్గురు త్రీ లైట్ జంక్షన్ సమీపంలో అటకాయించారు. తాము పోలీసులమని పరిచయం చేసుకుని వివరాలు అడిగారు. తన వంతు బాధ్యతగా వైద్యుడు వివరాలు చెప్పి ముందుకు సాగుతుండగా రెండు ద్విచక్ర వాహనాలపై ఆ ముగ్గురు వ్యక్తులు రవిని వెంబడించారు. అనుమానం కలిగిన రవి దారి మళ్లించాలని నిర్ణయించుకుని రైల్వే స్టేషన్ వైపు వెళ్లగా అక్కడికి సమీపంలో చీకటి ప్రాంతంలో రవి వాహనానికి అడ్డుగా తమ వాహనాలు నిలిపి మరోమారు తన ఐడీ చూపించాలని అడిగి కార్డు తీసుకున్నారు. డబ్బులు కావాలని బెదిరించారు. ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తే దాడి చేశారు. జేబుల్లో చేతులు పెట్టి పర్స్‌ను బలవంతంగా లాక్కొని అందులో ఉన్న రూ.2,500 నగదు తీసుకున్నారు. పర్సులో ఉన్న ఏటీఎం కార్డు తీసి డబ్బులు డ్రా చేసి ఇవ్వాలని అడిగారు. ఇవ్వనని తెగేసి చెప్పే సరికి దాడి చేసి తమ వద్ద ఉన్న ఓ పదునైన ఆయుధాన్ని చూపించి బెదిరించి ఏటీఎం వద్దకు బలవంతంగా తీసుకెళ్లారు. ఇద్దరు వ్యక్తులు త్రీ లైట్ జంక్షన్‌లో రవి వాహనం వద్ద ఉండగా, మరో వ్యక్తి తన వాహనంపై రవిని ఎక్కించుకుని వెళ్లాడు. స్థానిక నూకాలమ్మ గుడి వెనుక ఉన్న యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయించేందుకు ప్రయత్నం చేయగా, ఆ ఏటీఎం పనిచేయలేదు. దీంతో సమీపంలో ఉన్న నాలుగు ఏటీఎం కేంద్రాలకు తిప్పాడు. చివరికి మెయిన్ రోడ్డులో ఉన్న అపోలో ఆసుపత్రి సమీపంలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎం వద్ద ఆపి డబ్బు డ్రా చేయాలని బెదిరించాడు. ఈ క్రమంలో డాక్టర్ రవి తన స్నేహితుడికి అప్పటికే వాట్సాప్‌లో తన లొకేషన్ పంపి తాను ప్రమాదంలో ఉన్నానని సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన స్నేహితుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సమీపంలో ఉన్న బీటు కానిస్టేబుళ్లు నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన దోపిడీ దొంగ తన ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. బాధితుడు రవి తక్షణమే పోలీసులతో కలసి త్రీ లైట్ జంక్షన్‌లో తన వాహనం దగ్గర ఉన్న మిగిలిన ఇద్దరి కోసం వెళ్లగా వారు తమ తోటి దొంగ ఇచ్చిన ముందస్తు సమాచారంతో అప్పటికే పరారయ్యారు. రవి సహాయం కోసం ఎక్కడికీ వెళ్లకూడదన్న కుయుక్తితో అతడి వాహనం టైర్లను తమ వద్ద ఉన్న పదునైన ఆయుధంతో పొడిచేశారు. ఈ ఘటనపై టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వైద్యుడిపై దోపిడీ దొంగల దాష్టీకం


