మేమేం పాపం చేశాం..
● వయసు పైబడిందని
తొలగించడం అన్యాయం
● తిరిగి నియమించాలంటూ
మహిళల విన్నపాలు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో శానిటరీ విభాగంలో 50 ఏళ్లు పైబడిన 40 మంది మహిళలను తొలగించారని, తిరిగి విధుల్లో తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే నిబంధనతో పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల దేవస్థానంలో 26 మంది ఉద్యోగులను కొత్త కాంట్రాక్టర్ పద్మావతి హాస్పటాలిటీస్ అండ్ ఫెసలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (తిరుపతి) సంస్థ గత నెలలో తొలగించింది. అయితే ఆ సిబ్బంది అక్కడి దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకర్‌రావును ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరారు. దాంతో ఆయన ఆ కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తెచ్చి తొలగించిన ఉద్యోగులనరు తిరిగి నియమించాలని, వారి పొట్టకొట్టొద్దని చెప్పారు. దీంతో 60 ఏళ్లు దాటిన నలుగురు ఉద్యోగులు మినహా మిగిలిన వారిని తిరిగి ఆ కాంట్రాక్టర్ విధుల్లోకి తీసుకున్నారు. అన్నవరం దేవస్థానంలో కూడా గత నెలలో 40 మంది మహిళలను పద్మావతి హాస్పటాలిటీస్ అండ్ ఫెసలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (తిరుపతి) సంస్థ తొలగించింది. గతంలో ఎన్నడూ లేని నిబంధనతో వీరిని తొలగించడంపై ‘కూటమి కోసం కూడు కొట్టారు’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో గత నెల 24న కథనం ప్రచురితమైంది. అధికార కూటమికి చెందిన కార్యకర్తలను నియమించేందుకే వీరిని తొలగించారనే విమర్శలు వినిపించాయి. ‘సాక్షి’లో కథనం దేవస్థానంలో తీవ్ర చర్చనీయాంశమైంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో శానిటరీ విభాగ సిబ్బందిని 58 ఏళ్ల వరకూ కొనసాగించారు.
అటువంటిది ఈ ప్రభుత్వంలో 45 ఏళ్లు దాటితే తొలగించాలని, ఏకంగా జీఓ విడుదల చేయగా దేవస్థానం అధికారులు ముందుగా 50 ఏళ్లు దాటిన వారిని తొలగించారని కథనం వచ్చింది. దీనిపై స్పందించిన అధికారులు వివాదం ముదరకుండా ఆ మహిళలను కార్తిక మాసంలో పనిచేయడానికి తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. అయితే కార్తిక మాసం పూర్తవ్వడంతో ఒకటి రెండ్రోజులలో తిరిగి వారిని తొలగించనున్నారు. అయితే ద్వారకాతిరుమల దేవస్థానంలో ఏ విధంగా సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారో, అదే విధగా తమను కూడా తీసుకోవాలని వారు కోరుతున్నారు.


