ఆబోతుల వీరంగం: వ్యక్తి మృతి
అల్లవరం: కార్తిక మాసం సందర్భంగా తీర్థయాత్రకు వచ్చిన ఓ భక్తుడు ఆబోతుల వీరంగంలో మృత్యువాత పడ్డాడు. అల్లవరం ఎస్సై సంపత్‌కుమార్ కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతానికి చెందిన దంగేటి శ్రీనివాస్ (51) తన భార్య, కుమార్తెతో పాటు మరో ఇద్దరితో కలసి అయినవిల్లి, కుండలేశ్వరం పుణ్యక్షేత్రాలను ఆదివారం దర్శించుకుని ఓడలరేవుకు ఆటోలో వెళ్లారు. బీచ్ నుంచి తిరిగి వస్తుండగా అల్లవరం పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రధాన రహదారిపై ఆబోతులు వీరంగం చేస్తూ ఆటోపైకి దూసుకొచ్చాయి. దీంతో ఆటో బోల్తా పడడంతో శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన స్పందించి అల్లవరం సీహెచ్‌సీకి తరలించారు. అయితే అప్పటికే శ్రీనివాస్ మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
మరొకరు..
చాగల్లు: మండలంలోని బ్రాహ్మణగూడెం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్టు ఎస్సై కె.నరేంద్ర సోమవారం తెలిపారు. కలవలపల్లి గ్రామానికి చెందిన ఇరగవరపు ఆంజనేయులు (23) ఆదివారం రాత్రి మోటార్ సైకిల్‌పై విజ్జేశ్వరం గ్రామంలో ఉన్న తన సోదరి ఇంటికి వెళ్లి తిరిగి కలవలపల్లి వస్తున్నాడు. ఈ నేపథ్యంలో బ్రాహ్మణగూడెం శివారులోని కల్యాణ మండపం దాటిన తర్వాత ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆంజనేయులు తలకు బలమైన గాయమై అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి అన్నయ్య ఇరగవరపు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. మృతుడు వ్యవసాయం కూలీగా జీవనం సాగించేవాడు.
బాలికపై లైంగిక దాడి
కపిలేశ్వరపురం: ఓ బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు అంగర ఎస్సై జి.హరీష్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నల్లూరు గ్రామానికి చెందిన బాలిక (8)పై అదే గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆదివారం జరిగిన ఈ ఘటనపై బాధిత బాలిక అమ్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
ఇద్దరు పిల్లలతో
సహా వ్యక్తి అదృశ్యం
మలికిపురం: లక్కవరం గ్రామానికి చెందిన శిరిగినీడి దుర్గాప్రసాద్ తన ఇద్దరి పిల్లలతో అదృశ్యం అయ్యాడు. భార్యతో విభేదాల కారణంగా దుర్గాప్రసాద్ తన ఇద్దరి పిల్లలను ఆధార్ కార్డుల కోసం అని సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి తీసుకు వచ్చాడు. అనంతరం దిండి– చించినాడ వంతెనపైకి తీసుకు వెళ్లాడు. అక్కడ తన బైక్, జోళ్లు విడిచి అదృశ్యం అయ్యాడు. నదిలో దూకాడా... లేక ఎక్కడికై నా వెళ్లాడా అనేది తెలియాల్సి ఉంది. అయితే వారి ఆచూకీ కోసం పోలీసులు, కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు.


