సోమేశ్వరుని సన్నిధిలో సినీ నటుడు గౌతంరాజు
రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ బెస్తపేట సమీపంలో వేంచేసి ఉన్న ఆనంద అమృతవల్లీ సమేత సోమేశ్వరస్వామి కల్యాణ వేడుకను చివరి కార్తిక సోమవారం రోజున శాస్త్రోక్తంగా నిర్వహించారు. దివంగత గంపల సోమేశ్వరరావు సతీమణి భార్గవి ఆధ్వర్యంలో జరిగిన స్వామి కల్యాణ క్రతువులో సినీ నటుడు గౌతంరాజు దంపతులు పాల్గొన్నారు. అనంతరం అన్న ప్రసాదం భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో యాట్ల నాగేశ్వరరావు, గంపల వెంకట సోమరాజు, వాసంశెట్టి భవానీ శంకర్, కనకమేడల సంస్కారానంద, మాజీ సర్పంచ్ యాట్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
యువకుడిపై దాడి
బిక్కవోలు: రంగాపురం గ్రామానికి చెందిన ఓ యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు ఎస్సై వాసంశెట్టి రవిచంద్రకుమార్ తెలిపారు. సోమవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రంగాపురానికి చెందిన తంగెల్ల రాము అదే గ్రామానికి చెందిన ఓ యువతి గతంలో ప్రేమించుకున్నారు. ఇది ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేదు. దీంతో ఆ యువతి ఎక్కడికై నా తీసుకెళ్లమని, లేకపోతే చనిపోతానని రాముకు చెప్పడంతో సింగారం చింత గ్రామానికి తీసుకువెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె బంధువులు పోలీసుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి ఎవరి ఇంటికి వారిని తీసుకు వెళ్లిపోయారు. అయితే ఈ నెల 15న రాత్రి తుమ్మలపల్లి గ్రామంలో రాము బైకుపై వెళ్తుండగా నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అటకాయించారు. రాముపై దాడి చేశారు. దీంతో అతని తల్లి అనపర్తి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించి, సోమవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


