శెట్టిబలిజల ఐక్యత చాటుదాం
అమలాపురం రూరల్: తెలుగు రాష్ట్రాల్లోని శెట్టిబలిజలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి, ఐక్యత చాటే ఉద్దేశంతో ఆత్మీయ కలయిక ఏర్పాటు చేశామని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అమలాపురం మండలం పేరూరు పరిధి సత్తెమ్మ తల్లి ఆలయం ఆవరణలో ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నాలుగో శెట్టిబలిజ కార్తిక వన సమారాధన, ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలు ఐక్యంగా ఉంటూ ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యం కలిగి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. శెట్టిబలిజలకు రాజ్యాధికారం దిశగా కృషి చేస్తామన్నారు. శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ స్థాపించి మంత్రి సుభాష్ వ్యక్తిగతంగా రూ.కోటి విరాళంగా ప్రకటించారు. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ జాతి ఐక్యతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. శాసనమండలి మాజీ వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు మాట్లాడుతూ శెట్టిబలిజల అభ్యున్నతికి దొమ్మేటి వెంకటరెడ్డి, కుడుపూడి సూర్యనారాయణ వంటి మహనీయులు ఎంతో కృషి చేశారన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, సివిల్ సప్లయిస్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, శెట్టిబలిజ సంఘ నాయకులు మట్టపర్తి నాగేంద్ర, పెచ్చెట్టి విజయలక్ష్మి, గుత్తుల సాయి, వాసంశెట్టి చినబాబు, చొల్లంగి వేణుగోపాల్, వాసంశెట్టి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు,
మంత్రి సుభాష్
శెట్టిబలిజల ఐక్యత చాటుదాం


