కార్తిక సన్‌దడి
కొత్తపల్లి: సముద్ర తీరంలో పర్యాటకుల సందడి నెలకొంది.. కార్తిక మాసం, ఆపై ఆదివారం కావడంతో కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరం కళకళలాడింది. వన సమారాధనల జోరు పెరిగింది. స్నేహితులు, బంధువులతో బీచ్‌కు వచ్చి సాయంత్రం వరకూ ఉల్లాసంగా, ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. కాకినాడ సమీపంలోని వాకలపూడి లైట్ హౌస్ నుంచి ఉప్పాడ బీచ్ రోడ్డు వరకూ పర్యాటకుల వాహనాలతో నిండిపోయింది. సుమారు ఐదు కిలోమీటర్ల మేర ఉన్న ఈ తీర ప్రాంతంలో ఎక్కడ చూసినా సందడి కనిపించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు ఉప్పాడ బీచ్‌కు తరలివచ్చారు. ఆదివారం కావడంతో తుని సమీపంలోని తలుపులమ్మ లోవ అమ్మవారిని దర్శించుకుని మధ్యాహ్న భోజనం అనంతరం తీర ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడ వసతులు లేకపోవడంతో కాస్త ఇబ్బందులు పడ్డారు. తీర ప్రాంతంలోని సరుగుడు తోటలు, బెంచీలు తొలగించడంతో అవస్థలు ఎదుర్కొన్నారు. కనీసం తాగేందుకు నీరు లేకపోవడంపై విస్తుపోయారు. ఇదిలాఉంటే సాగర తీరంలో పిల్లలు, పెద్దలు కేరింతలు కొట్టారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు టెంట్లు వేసుకుని, సౌండ్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేసుకుని ఆట పాటలతో డ్యాన్స్ చేశారు. క్రీడల్లో విజయం సాధించిన వారికి బహుమతులను పంపిణీ చేశారు. ఈ సాగర తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. బీచ్ రోడ్డులోకి భారీగా వచ్చిన పర్యాటకుల వాహనాలతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఉప్పాడ సాగర తీరంలో పర్యాటకుల సందడి
ఫ సాగర తీరంలో వన సమారాధనలు
ఫ కేరింతలు కొట్టిన చిన్నారులు


