తేగనచ్చేస్తున్నాయ్..
నాగుల చవితి తర్వాత దొరికే తేగలంటే అందరికీ ఇష్టమే.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతంలో ఎక్కువగా లభిస్తుంటాయి. డెల్టా ప్రాంతంలో తాటి చెట్లు ఉన్నా మెట్ట ప్రాంతంలో తేగల పాతర వేసి వాటిని విక్రయించడం చాలామందికి జీవనోపాధిగా మారింది. జూన్, జులై నెలల్లో తాటిచెట్లను కొనుగోలు చేసి పండ్లను పాతర వేసి సీజన్‌లో తేగలను అమ్ముతుంటారు. అటువంటి తేగల ధర ప్రస్తుతం కొండెక్కింది. దశాబ్ద కాలం కిందట పది తేగలతో కూడిన కట్ట రూ.10 నుంచి రూ.15 పలకగా, నేడు రూ.50కు చేరింది. తాటి పండ్లను భూమిలో పాతరేస్తే తేగలుగా మారతాయి. పూర్తిగా పీచు పదార్థంతో కూడిన తేగలను జీర్ణశక్తి కోసం ప్రతి ఒక్కరూ ఆహారంగా తీసుకుంటారు. నాగేంద్రుడికి ప్రీతిపాత్రంగా భావించే తేగలను నాగుల చవితిరోజు పుట్టలో స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఉభయ గోదావరి జిల్లాల్లో తేగల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి తేగలను బంధువులు దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులకు కూడా పంపిస్తుంటారు. అయితే రియల్ ఎస్టేట్ రంగం పుణ్యమా అని మెట్ట ప్రాంతంలో తాటిచెట్ల ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది. దీనితో తాటి తోపులు తగ్గడంతో సహజంగానే తాటిపండ్లు తగ్గిపోయాయి. ఇలా తేగలకు సహజంగానే ధర పెరిగిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. మెట్ట ప్రాంతంలో తేగలు రుచికరంగా కూడా ఉండడంతో వాటిని వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఏదేమైనా వ్యాపారులు చెబుతున్న తేగల ధర విని సామాన్యులు అమ్మో అంటున్నారు.
– రాయవరం


