బాలిక అదృశ్యం
రంగంపేట: ఓ బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు రంగంపేట ఎస్సై శివప్రసాద్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని ఎస్టీ రాజాపురం గ్రామానికి చెందిన ఓ బాలిక (17) రాజానగరంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతోంది. శనివారం ఉదయం కళాశాలకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తిరిగి రాకపోవడంతో బంధువుల ఇళ్లు, పరిసర గ్రామాల్లో వెతకగా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో ఆమె తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు జేశారు.
ఆబోతు దాడిలో వృద్ధుడి మృతి
కాకినాడ రూరల్: ఆబోతు దాడిలో తూరంగి రణదీప్‌నగర్‌కు చెందిన గండిమేని పేరులు (75) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం కాలకృత్యాల నిమిత్తం బయకు వెళ్తున్న పేరులును ఆబోతు కొమ్ములతో పొడిచి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతడిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఇంద్రపాలెం అడిషనల్ ఎస్సై సమర్పణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బాల భీముడి జననం
ఫ శిశువు బరువు 4.2 కిలోలు
ప్రత్తిపాడు: స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లో ఆదివారం ఓ మాతృమూర్తి బాల భీముడికి జన్మనిచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. తునికి చెందిన వెలుగుల క్రాంతి రెండో కాన్పుకు చింతలూరు గ్రామంలోని పుట్టింటికి వచ్చింది. నెలలు నిండడంతో శనివారం స్థానిక సీహెచ్‌సీలో చేరింది. అయితే హైరిస్క్ కేసుగా వైద్యులు నిర్ధారించారు. కడుపుతో ఉన్నప్పుడు వచ్చే షుగర్ వ్యాధి ఉండడంతో ఆమెకు వైద్య సిబ్బంది శస్త్రచికిత్స చేశారు. అయితే పుట్టిన మగ శిశువు బరువు 4.2 కిలోలు ఉండడంతో బంధువులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు సీహెచ్‌సీ సూపరిటెండెంట్ డాక్టర్ బి.సౌమ్య మైఖేల్ తెలిపారు.


