వాడపల్లికి పోటెత్తిన భక్తులు
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవీ, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రానికి శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్తిక బహుళ ఏకాదశి పర్వదినం కూడా కలిసి రావడంతో ఆలయానికి వేలాదిగా పోటెత్తారు. ప్రధానార్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వేదాశీర్వచనం, అన్నప్రసాద విరాళం, వివిధ సేవలు, లడ్డూల విక్రయం, ఆన్‌లైన్ సేవల ద్వారా దేవస్థానానికి రూ.60,26,448 ఆదాయం వచ్చినట్టు దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.
అప్పనపల్లిలో భక్తుల రద్దీ
మామిడికుదురు: కార్తిక బహుళ ఏకాదశి శనివారం సందర్భంగా అప్పనపల్లిలోని బాల బాలాజీ స్వామి వారి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేశారు. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామి వారి ధ్వజస్తంభం వద్ద కార్తిక దీపాలు వెలిగించారు. పాత ఆలయంలో అభిషేకాలు చేయించుకున్నారు. స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.6,63,405 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. స్వామివారిని 8 వేల మంది భక్తులు దర్శించుకున్నారని, 5,500 మంది అన్న ప్రసాదం స్వీకరించారన్నారు. స్వామి వారి నిత్య అన్న ప్రసాదం ట్రస్టుకు భక్తులు రూ.2,28,539 విరాళాలుగా అందించారని వివరించారు.


