లారీ ఢీకొని వ్యక్తి మృతి
కె.గంగవరం: మండలంలోని యర్రపోతవరం – బాలాంతరం గ్రామాల మధ్య యానాం ప్రధాన రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరు గాయాలపాలయ్యారు. కె.గంగవరం ఎస్సై జానీ బాషా తెలిపిన వివరాల ప్రకారం.. బాలాంతరం గ్రామానికి చెందిన పంపన భాస్కరరావు (72), విత్తనాల శివ ప్రసాద్ యర్రపోతవరం నుంచి బాలాంతరం వెళుతున్నారు. వారిని ద్రాక్షారామ నుంచి యానాం వైపు వెళుతున్న లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో భాస్కరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాల పాలైన శివప్రసాద్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


