చిట్టిబుర్రలపై.. పెను భారం
ఈ విధానమే సరికాదు
నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) పరీక్ష విధానమే సరి కాదు. 1, 2 తరగతులకు రెండుసార్లు జవాబులు రాయాలనడంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఉపాధ్యాయులే సమాధానం చెప్పి రాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో, విద్యార్థులు చదువుపై పట్టు కోల్పోయే ప్రమాదం ఉంది.
– చింతాడ ప్రదీప్ కుమార్,
పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు
మార్పు తీసుకురావాలి
ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్ష విధానంలో మార్పులు రావాలి. ఒక సిలబస్‌నే రెండుసార్లు ఇవ్వడంతో ప్రయోజనం ఉండదు. దీంతో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇది సరైన విధానం కాదు
– మోర్త శ్రీనివాసరావు,
ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు
చిన్నారులపై భారం తగదు
చిన్నారులపై ఈ విధమైన పరీక్షల భారం తగదు. తద్వారా వారిలో పరీక్షలంటే భయం కలిగే అవకాశం ఏర్పడుతుంది. ఇటువంటి పరీక్షల విధానంపై పునరాలోచన చేయాలి. స్కూల్ స్థాయి పరీక్షల ఽవిధానంలో మార్పు రావాలి.
– వాకాడ వెంకట రమణ,
సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్
ఉత్తీర్ణత తగ్గుతుంది
ఈ విధమైన పరీక్షలతో విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని పరీక్ష విధానంపై సరైన నిర్ణయం తీసుకోవాలి. సమయమంతా దీనికే సరిపోతే ఇక బోధన ఏవిధంగా చేయాలి?
– కె.కాశీ విశ్వనాథ్, ఎస్‌టీయూ
జిల్లా ప్రధాన కార్యదర్శి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆడుతూ పాడుతూ విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన వయస్సు. గురువుల వద్ద అక్షరాలు దిద్ది. పుస్తకాలు చదవడం నేర్చుకుని.. చిన్నచిన్న ప్రశ్నలకు తెలిసీ తెలియని జవాబులు చెప్పే అమాయకత్వం. ఆ క్రమంలోనే చిన్నచిన్న పరీక్షలు రాసే సమర్థత పెంచుకునే ప్రయత్నం.. ప్రాథమిక పాఠశాలల్లో చదువుకునే ప్రతి చిన్నారి పరిస్థితీ దాదాపు ఇదే. అటువంటి చిట్టి బుర్రలపై చంద్రబాబు ప్రభుత్వం చదువుల పేరుతో పెద్ద భారమే మోపుతోంది. పాతిక మార్కుల పరీక్ష అంటేనే ఏమిటో అర్థం కాని వయస్సులో ఉన్న ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు ఏకంగా 100 మార్కులకు పరీక్ష పెడుతోంది. పసి మనసులపై ఒత్తిడి పెంచేలా ఇటువంటి పరీక్షలు నిర్వహించడం మునుపెన్నడూ చూడలేదని, ఇదెక్కడి విడ్డూరమని ఇటు ఉపాధ్యాయులు, అటు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏం జరుగుతోందంటే..
చదువులు, ర్యాంకుల పేరుతో ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురి చేయడం అందరికీ తెలిసిందే. ఇప్పుడీ కోవలోకి ప్రభుత్వ స్కూళ్లు కూడా వచ్చి చేరాయి. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్‌ఏ) పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఒకటి నుంచి పదో తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఈ నెల 10 నుంచి ఎస్‌ఏ పరీక్షలు నిర్వహిస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1.8 లక్షల మందికి పైగా విద్యార్థులుండగా.. వీరిలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ 85 వేల మందికి పైగా ఉన్నారు. ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు కూడా ఈ పరీక్షలు రాయాలి. వీరందరికీ ఒకే ప్రశ్న పత్రాన్ని ముద్రించి పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌సీఈఆర్‌టీ) ముద్రించిన ప్రశ్నపత్రంతోనే పరీక్షలు జరుపుతూండగా.. ప్రైవేటు యాజమాన్యాలు మాత్రం సొంతంగా ముద్రించి నిర్వహిస్తున్నాయి.
పరీక్షలు ఇలా..
● 1, 2 తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్.. 3, 4, 5 తరగతుల వారికి తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ పరీక్షలు ఉంటాయి. అదే 6 నుంచి పదో తరగతి వరకూ సబ్జెక్టుల వారీగా నిర్వహిస్తారు.
● ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులుకు గతంలో 50 మార్కులకు మాత్రమే ఎస్‌ఏ పరీక్షలు నిర్వహించేవారు. ఇప్పుడు దీనిని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ఏకంగా 100 మార్కులకు పెంచేసింది. ఇందులో రాత పరీక్షకు 80 మార్కులు, ఇంటర్నల్‌కు మరో 20 మార్కులు ఉంటాయని ప్రకటించారు. ఇంటర్నల్ మార్కులు ఏవిధంగా ఇస్తారనేది ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదు. రాత పరీక్షలో ప్రశ్నలు తమకు సైతం అర్థం కాని రీతిలో ఇస్తున్నారని ఉపాధ్యాయులు అంటున్నారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి లేదని చెబుతున్నారు.
● దీనికి తోడు మునుపెన్నడూ చూడని రీతిలో ఆన్సర్ షీటుతో పాటు వర్క్ బుక్‌లో సైతం జవాబులు రాయాలని ఆదేశించారు. దీంతో, ఏమీ తెలియని చిన్నారులు తీవ్ర ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.
● 1, 2 తరగతుల వారికి 8 పేజీలు.. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఏకంగా 15 పేజీలు కేటాయించారు. 20 ప్రశ్నలకు సంబంధించిన జవాబులను ఆన్సర్ షీటులోను, 13 ప్రశ్నల సమాధానాలను వర్క్‌బుక్‌లోను రాయాల్సి ఉంది.
● పరీక్ష సమయం 2.30 గంటలు ఇచ్చారు. అయితే, ఆ సమయంలో జవాబులు రెండు షీట్లలో ఏవిధంగా రాయాలో అర్థం కాక చిన్నారులు సతమతమవుతున్నారు. రెండు పేపర్లు రాసేందుకు నాలుగైదు గంటల సమయం పడుతోందని చెప్తున్నారు. ఈ ప్రశ్న పత్రం ప్రకారం మెజార్టీ విద్యార్థులు ఫెయిలయ్యే పరిస్థితి ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని దాదాపు అన్ని పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులే విద్యార్థులకు సమాధానాలు చెప్పి రాయిస్తున్నారని తెలుస్తోంది. పరీక్ష నిర్వహణ, మూల్యాంకనానికే సమయం సరిపోతోందని, బోధన ఇంకెప్పుడు చేయాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. అసలీ వ్యవహారం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులకు తెలిసే జరుగుతోందా అనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధ్యాయుల ఆగ్రహం
ఇది 1, 2 తరగతుల విద్యార్థుల ప్రశ్నపత్రంలా లేదని.. ఎంఏ చదివే వారికి ఇచ్చిన తరహాలో ఉందని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. దీని ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను ఏ విధంగా పరీక్షించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సిలబస్‌తో సంబంధం లేదని, శాసీ్త్రయంగా కూడా లేదని చెబుతున్నారు. ఎస్‌ఏ, ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్‌ఏ) ప్రశ్నపత్రాల రూపకల్పనలో తమ అభిప్రాయాలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
1, 2, 3 తరగతుల విద్యార్థులకు
100 మార్కులకు ఎస్‌ఏ నిర్వహణ
80 మార్కులకు ప్రశ్నపత్రం
ఇంటర్నల్‌కు మరో 20
ఆన్సర్ షీట్‌తో పాటు వర్క్‌బుక్‌లోనూ
జవాబులు రాయాల్సిందే..
రెండున్నర గంటలే సమయం
ఇదెక్కడి విడ్డూరమంటున్న
టీచర్లు, తల్లిదండ్రులు
చిట్టిబుర్రలపై.. పెను భారం
చిట్టిబుర్రలపై.. పెను భారం
చిట్టిబుర్రలపై.. పెను భారం
చిట్టిబుర్రలపై.. పెను భారం


