అక్రమాల గుట్టలు | - | Sakshi
Sakshi News home page

అక్రమాల గుట్టలు

Nov 15 2025 7:37 AM | Updated on Nov 15 2025 7:37 AM

అక్రమ

అక్రమాల గుట్టలు

కాకరపర్రు స్టాక్‌ పాయింట్‌ వద్ద లారీలోకి పొక్లెయిన్‌తో

ఇసుక లోడింగ్‌

సాక్షి, రాజమహేంద్రవరం: ఇసుక మాఫియా బరి తెగిస్తోంది. కూటమి నేతల అండదండలతో అనధికార ధరల దందాకు తెర లేపింది. ప్రభుత్వం నిర్దేశించిన దాని కంటే అధిక ధరలకు ఇష్టారాజ్యంగా అమ్ముతూ.. కొనుగోలుదార్లను నిలువుదోపిడీ చేస్తూ రూ.లక్షలు దండుకుంటోంది. నిడదవోలు నియోజకవర్గంలో నిబంధనలను ఇసుకలో తొక్కేస్తోంది. కళ్ల ముందే అక్రమాలు జరుగుతున్నా మైనింగ్‌, రెవెన్యూ, పోలీసు అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అక్రమ దందాకు అడ్డాగా..

ఇసుక అక్రమ దందాకు నిడదవోలు నియోజకవర్గం అడ్డాగా మారింది. ఈ నియోజకవర్గంలో 7 ఇసుక ర్యాంపులున్నాయి. వీటి నుంచి తవ్విన ఇసుకను స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. ఇక్కడే దందా మొదలవుతోంది. గోదావరి వరదలను దృష్టిలో ఉంచుకుని ఇసుక అందుబాటులో ఉంచాలనే తలంపుతో గతంలో స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు. దీనిని ఇసుక మాఫియా, కాంట్రాక్టర్లు, పాటదారులు అవకాశంగా తీసుకుంటున్నారు. ప్రభుత్వ ధరలను కాదని తమకు ఇష్టమొచ్చిన రేటుకు ఇసుక విక్రయిస్తున్నారు. వారు చెప్పిందే రేటు అన్నట్టుగా పరిస్థితి ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం స్టాక్‌ పాయింట్లను బట్టి టన్ను ఇసుకను రూ.145 నుంచి రూ.160కి విక్రయించాలి. దీని ప్రకారం 20 టన్నులకు రూ.2,900 నుంచి రూ.3,200 అవుతుంది. కానీ, 20 టన్నుల లారీ ఇసుకను డిమాండును బట్టి రూ.6 వేల నుంచి రూ.7 వేలకు అమ్ముతున్నారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే ఇష్టమైతే కొను.. లేదంటే పొమ్మని తెగేసి చెబుతున్నారు. ఈవిధంగా ప్రతి రోజూ వందల లారీల ఇసుక విక్రయిస్తూ రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే జవాబు చెప్పే నాథుడే కరువయ్యారు. కూటమి ప్రజాప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉండటంతో ‘తాము చెప్పిందే రేటు’ అన్నట్టుగా ఇసుక మాఫియా వ్యవహరిస్తోంది. ఈ దందా చూసి లారీ డ్రైవర్లు, ఇసుక కొనుగోలుదార్లు విస్తుపోతున్నారు.

గుట్టల్లో గుట్టు!

ఒక్కో ఇసుక స్టాక్‌ పాయింట్‌ నుంచి ప్రతి రోజూ పదుల సంఖ్యల లారీల ఇసుక తరలిపోతోంది. అటువంటప్పుడు ఆ స్టాక్‌ పాయింట్లలో ఇసుక గుట్టలు సైతం కరగాలి. కానీ, దీనికి భిన్నంగా గుట్టలు మరింత పెరుగుతున్నాయి. దీనిని బట్టి చూస్తే.. తరలుతున్న ఇసుక తరలుతూనే ఉండగా.. ఆ గుట్టల్లో తిరిగి అక్రమంగా ఇసుక నింపేస్తున్నారు. ఈ తంతు నిత్యకృత్యంగా మారుతోంది. ఫలితంగా ప్రారంభించినప్పుడు ఉన్న స్థాయిలోనే స్టాక్‌ పాయింట్లలో ఇసుక నిల్వలు ఉంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

కానూరు గుట్ట కథేమిటో?

కానూరు శశి స్కూల్‌ సమీపాన ఉన్న ఇసుక గుట్ట తూర్పు గోదావరికి కేటాయించిందా.. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబధించినదా.. అనే విషయం అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఇక్కడి స్టాక్‌ పాయింట్‌ను పశ్చిమ గోదావరి జిల్లాకు కేటాయించినట్లు అధికారులు చెప్పారు. కానీ, అమ్మకాలు మాత్రం అన్ని జిల్లాలకూ జరుగుతున్నాయి. కాకరపర్రు, కానూరు స్టాక్‌ పాయింట్లలో పగలు కాకుండా రాత్రి వేళల్లో దందా జోరుగా సాగుతోంది. వందలాది లారీల ఇసుక రాత్రికి రాత్రే తరలిపోతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇసుక లారీలతో సాధారణ వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పర్యవేక్షణేదీ?

ఇసుక స్టాక్‌ పాయింట్ల వద్ద అధికారుల నిఘా ఏమాత్రం ఉండటం లేదు. రెవెన్యూ, పోలీసు అధికారుల జాడ కూడా కనబడటం లేదు. గుట్టల్లో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. మైనింగ్‌ అధికారులు అడపాదడపా దాడులు చేస్తున్నా కేవలం జరిమానాలు విధించి వదిలేస్తున్నారు. దీంతో, ఇసుక మాఫియా ఆగడాలకు హద్దు లేకుండా పోతోంది.

ఏ జిల్లా ఏ జిల్లా..: కానూరు

శశి స్కూల్‌ పక్కన వేసిన గుట్ట

కానూరు కొండలమ్మ గుడి వెనుక ఉన్న ఇసుక స్టాక్‌ పాయింట్‌

నిడదవోలు నియోజకవర్గంలో

ఇసుక దందా

అధిక ధరలకు అమ్మకాలు

నిబంధనల ప్రకారం 20

టన్నుల లారీ ఇసుక రూ.2,900

విక్రయిస్తున్నది రూ.6 వేలకు..

పట్టించుకోని అధికారులు

అనధికారికం.. అధికారికం..

ఇసుక స్టాక్‌ యార్డుల పేరిట అధికారికంగా ఇసుక గుట్టలు వేశారు. వీటిని అధికారులు పరిశీలించి ఎక్కడెక్కడ ఏ మేరకు ఇసుక నిల్వలున్నాయో లెక్క కట్టారు. అనంతరం ఇసుక మాఫియా ఈ అధికారిక గుట్టల్లో అనధికారికంగా దాచి ఉంచిన ఇసుకను కలిపేసి, దర్జాగా విక్రయాలు చేపడుతోంది.

పురుషోత్తపల్లి, కానూరు, కాకరపర్రు గ్రామాల వద్ద ఇసుక గుట్టలు ఎంతకూ తగ్గకపోవడమే మాఫియా ఇసుక దోపిడీకి సాక్ష్యంగా నిలుస్తోంది. ఇసుక అమ్మకాలు ఎక్కడా ఆగడం లేదు.. రాత్రి, పగలు వాహనాల్లో ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు తరలిపోతూనే ఉంది.. అయినా ఇసుక మాత్రం రవ్వంత కూడా తరగడం లేదు.

కానూరు కొండలమ్మ గుడి వెనుక వేసిన (మునిపల్లి స్టాక్‌ పాయింట్‌) అధికారిక గుట్టలో 52,652 మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వ ఉన్నట్లు అధికారికంగా చూపించారు. కానీ, ఇక్కడ మాత్రం సుమారు 80 వేల మెట్రిక్‌ టన్నుల నిల్వ ఉన్నట్లు సమాచారం.

కానూరు – పెండ్యాల ర్యాంపులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను గోదావరి వరద ముసుగులో పగలు, రాత్రి తరలించేసి, అధికారిక గుట్టలో కలిపేశారు.

కాకరపర్రు స్టాక్‌ పాయింట్‌లో 45 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వ ఉన్నట్లు చూపించారు. ఇక్కడి ర్యాంపులో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను తీసుకువచ్చి అధికారిక గుట్టలో కలిపేయడంతో చిన్న ఇసుక గుట్ట కాస్తా కొండలా మారింది.

అక్రమాల గుట్టలు1
1/3

అక్రమాల గుట్టలు

అక్రమాల గుట్టలు2
2/3

అక్రమాల గుట్టలు

అక్రమాల గుట్టలు3
3/3

అక్రమాల గుట్టలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement