రత్నగిరికి భక్తుల తాకిడి
● సత్యదేవుని దర్శించిన 50 వేల మంది
● 4,800 వ్రతాల నిర్వహణ
● రూ.50 లక్షల ఆదాయం
అన్నవరం: సత్యదేవుని ఆలయానికి భక్తుల తాకిడి కొనసాగుతోంది. కార్తిక బహుళ దశమి, శుక్రవారం పర్వదినం కావడంతో తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకూ వేలాదిగా భక్తులు రత్నగిరికి తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు, క్యూ లైన్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పార్కింగ్ స్థలాలు భక్తుల వాహనాలతో నిండిపోయాయి. సాయంత్రం 4 గంటల వరకూ రద్దీ కొనసాగింది. సుమారు 50 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. స్వామివారి వ్రతాలు 4,800 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. కార్తిక మాసంలో చివరి శనివారం, ఏకాదశి పర్వదినం కలిసి రావడంతో శుక్రవారం రాత్రి నుంచే భక్తులు అధిక సంఖ్యలో రత్నగిరికి చేరుకుంటున్నారు. సత్యదేవుని ఆలయాన్ని వేకువజామున ఒంటి గంటకు తెరచి వ్రతాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే సత్యదేవుని దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు.
94 వేలు దాటిన సత్యదేవుని వ్రతాలు
కార్తిక మాసంలో ఇంకా ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉండగా శుక్రవారం నాటికి సత్యదేవుని వ్రతాలు 94 వేలు మాత్రమే జరిగాయి. గత ఏడాది ఇదే సమయానికి 1,19,550 వ్రతాలు జరిగాయి. దీంతో పోల్చితే ఈ కార్తికంలో ఇప్పటి వరకూ సుమారు 25 వేల వ్రతాలు తక్కువగా జరిగాయి. శనివారం ఏకాదశి పర్వదినం కావడంతో 10 వేలకు పైగా వ్రతాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. అలాగే, ఆది, సోమవారాల్లో సుమారు 15 వేలు, ఆ తరువాతి మూడు రోజులూ మరో 10 వేల వ్రతాలు జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ కార్తిక మాసంలో సుమారు 1.30 లక్షల వ్రతాలు జరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత ఏడాది కార్తిక మాసంలో 1.47 లక్షల వ్రతాలు జరిగాయి.


