గిరిజన విద్యార్థినికి ‘సఖి’ చేయూత
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లోని సఖి వన్‌స్టాప్ సెంటర్ చొరవతో ఓ గిరిజన విద్యార్థినికి వసతి సమకూరింది. వివరాల్లోకి వెళ్తే.. రంపచోడవరానికి చెందిన తేజస్విని తండ్రి చిన్నతనంలో చనిపోయాడు. తల్లి పెంచి పోషించి, ఇంటర్మీడియెట్ వరకూ చదివించింది. ఆరోగ్యం క్షీణించి ఆమె మంచాన పడటంతో తేజస్విని డిగ్రీ చదువుకు ఆటంకం కలిగింది. మెరిట్‌తో కాకినాడ సమీపంలోని పటవలలోని కైట్ కాలేజీలో డిగ్రీ సీటు సాధించినా, నిలువ నీడ లేకుండా పోయింది. అలాగని సుదూరాన ఉన్న స్వగ్రామానికి రోజూ వెళ్లి రావడం అసాధ్యం. ఈ నేపథ్యంలో పత్రికల్లో సఖి వన్‌స్టాప్ సెంటర్ గురించి తెలుసుకున్న తేజస్విని కొద్ది రోజుల క్రితం అడ్మిన్ ఆర్.శైలజను ఫోనులో సంప్రదించింది. సాయం చేయాలని కోరింది. తక్షణమే స్పందించిన శైలజ ఈ విషయాన్ని మహిళా, శిశు సంక్షేమ శాఖ పీడీ సీహెచ్ లక్ష్మికి తెలియజేశారు. ఆమె ఆదేశాల మేరకు సామర్లకోటలోని కేటీసీ విద్యా సంస్థల అధినేత ప్రవీణ్ చక్రవర్తిని కలిసి, విద్యార్థిని చదువుకు సాయం అందించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ప్రవీణ్ చక్రవర్తి శుక్రవారం సఖి వన్‌స్టాప్ సెంటర్‌కు వచ్చి విద్యార్థిని వసతికి అవసరమైన హాస్టల్ ఫీజు మొత్తాన్ని అందజేశారు.


