పెద్దిరెడ్డి కుటుంబంపై బురద జల్లేందుకే ఆరోపణలు
కాకినాడ రూరల్: తమ నాయకులపై బుదరజల్లే కార్యక్రమానికి చంద్రబాబు ప్రభుత్వం పూనుకుందని, అందులో భాగంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి మండిపడ్డారు. తమ పార్టీ సీనియర్ నేత అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయనవి ఆరోపణలేనని, నిరూపణ కావని స్పష్టం చేశారు. పెద్దిరెడ్డి కబ్జా చేశారని ఆరోపిస్తున్న సదరు భూమి.. ఆయనకు చెందినదేనంటూ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ చలపతిరావు నిర్ధారించిన విషయాన్ని గ్రహించాలన్నారు. 1968 గెజిట్ ప్రకారం సర్వే నంబరు 295, 296లో కూడా ఆ భూమి పెద్దిరెడ్డికి చెందినదిగానే రికార్డులు చెబుతున్నాయని, అనుమానం ఉంటే డెహ్రడూన్ నుంచి మ్యాప్‌లు రప్పించుకుని పరిశీలించాలని సూచించారు. ఉమ్మడి ఏపీ అటవీ శాఖ మంత్రిగా పని చేసిన పెద్దిరెడ్డి.. శంషాబాద్‌లో 450 ఎకరాల అటవీ భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి కాపాడారని గుర్తు చేశారు. చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడటం కోసం రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిలను వేధించడం తగదని హితవు పలికారు. అసత్య ఆరోపణలు చేసే బదులు అటవీ, రెవెన్యూ చట్టాలు చదువుకోవాలని సూచించారు. విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతూ, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రక్రియలకు పవన్ తెర తీశారని నాగమణి ఆగ్రహం వ్యక్తం చేశారు.


