
డ్రెయిన్‌లో పడి యువకుడి మృతి
కాజులూరు: మోటార్ బైక్ అదుపు తప్పడంతో స్థానిక టేకి డ్రెయిన్‌లో పడి దాకమూరి నాగరాజు (22) మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం కోలంక గ్రామానికి చెందిన దాకమూరి నాగరాజు హైదరాబాద్‌లో ర్యాపిడో సర్వీసులో పనిచేస్తున్నాడు. ఇటీవల గ్రామంలో అమ్మవారి జాతరకు వచ్చాడు. సోమవారం రాత్రి కోలంక నుంచి ద్రాక్షారామ వెళుతుండగా, ఉప్పుమిల్లి శివారు గొప్పిరేవు వద్ద మోటార్ బైక్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో నాగరాజు శిథిలమైన రెయిలింగ్ నుంచి టేకి డ్రెయిన్‌లో పడిపోయాడు. మృతదేహం కొట్టుకుపోయి, తాళ్లరేవులో లభ్యమైంది. కాగా, నాగరాజుకు వివాహం కాలేదు. తల్లిదండ్రులు ఉన్నారు. కోలంకలో మృతుని ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు గొల్లపాలెం పోలీసులు తెలిపారు. ఎస్సై మోహన్‌కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.