
ప్రైవేట్ ఏజెన్సీల విధానాన్ని రద్దు చేయాలి
కలెక్టరేట్ వద్ద రవాణా జేఏసీ ధర్నా
అమలాపురం రూరల్: రవాణా శాఖాధికారులను పక్కనపెట్టి, వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ ప్రైవేట్ ఏజెన్సీలు ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా రవాణా జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రవాణా జేఏసీ జిల్లా కో–ఆర్డినేటర్, ఆంధ్రా ఆటోవాలా జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి, కలెక్టర్ మహేష్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సత్తిరాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల మోటారు వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ చేయడానికి జిల్లా రవాణా అధికారులను విస్మరించి, ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం వల్ల వాహన యాజమానులు ఆర్థికంగా ఇబ్బందులు పడతారన్నారు. యాంత్రీకరణ విధానం నిలిపి, పాత విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రవాణా జేఏసీ అనుబంధ సంఘాల జిల్లా స్థాయి సదస్సు ఈ నెల 4న అమలాపురంలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 9న సార్వత్రిక సమ్మెలో పాల్గొంటామని తెలిపారు. రవాణా జేఏసీ జిల్లా కన్వీనర్ రాగుర్తి వెంకటేశ్వరరావు, నాయకులు పోలిశెట్టి సీతారాంబాబు, బొంతు బాలరాజు, యాళ్ల వెంకటేశ్వరరావు, ఎల్లమెల్లి పెద్దా తదితరులు పాల్గొన్నారు.