ఇదేం తీరువా బాబూ! | - | Sakshi
Sakshi News home page

ఇదేం తీరువా బాబూ!

Jul 2 2025 5:45 AM | Updated on Jul 2 2025 7:22 AM

ఇదేం

ఇదేం తీరువా బాబూ!

రూ.12 కోట్ల నీటితీరువా వసూలుకు సర్కారు సన్నాహాలు

కొత్తగా రూ.35 సర్వీసు ట్యాక్స్‌

చిల్లిగవ్వ సాయం చేయకపోగా ఈ వసూళ్లేమిటని రైతుల అసహనం

సాక్షి ప్రతినిధి, కాకినాడ: గత ఖరీఫ్‌, తరువాత రబీ సీజన్లు రెండూ వెళ్లిపోయాయి. మళ్లీ ఖరీఫ్‌ వచ్చేసింది. అయినప్పటికీ పెట్టుబడి సాయంగా రూ.20 వేలు ఇస్తామన్న చంద్రబాబు మాట ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. దీంతో, సాగు పెట్టుబడి కోసం రైతులు నానా అగచాట్లూ పడుతున్నారు. సరిగ్గా ఇదే తరుణంలో పులి మీద పుట్రలా నీటితీరువా వసూళ్లకు కూటమి సర్కారు సన్నాహాలు చేస్తోంది. పిడుగులాంటి ఈ వార్త రైతులను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది.

సిద్ధమవుతున్న రెవెన్యూ యంత్రాంగం

జిల్లాలోని కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలో రెండు ఫసలీల(1433, 1434)కు (ఫసలీ – పంట కాలం) పాత బకాయిలతో కలిపి నీటితీరువా రూ.12 కోట్ల పైమాటే. ఈ మొత్తాన్ని రైతుల నుంచి వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక్క పెద్దాపురం రెవెన్యూ డివిజన్‌లోనే 11 మండలాల్లో 1.79 లక్షల పై చిలుకు ఖాతాల్లో నీటితీరువా వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఈ ఏడాది మే నెల నాటికి 1434 ఫసలీలో రైతుల నుంచి నీటితీరువా బకాయి రూ.7.36 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాకినాడ డివిజన్‌లోని 10 మండలాల్లోని 143 గ్రామాల పరిధిలో 1,07,720 ఖాతాలున్నాయి. వీటి ద్వారా రూ.4.80 కోట్ల బకాయిలున్నాయని లెక్కలు తేల్చారు. ఈ రకంగా జిల్లావ్యాప్తంగా 2,86,771 ఖాతాల నుంచి నీటితీరువా బకాయిలు వసూలు చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమవుతోంది.

సర్వీస్‌ ట్యాక్స్‌ బాదుడు

ఈ మేరకు ఆర్‌డీఓలకు, మండలాల తహసీల్దార్లకు, అక్కడి నుంచి వీఆర్‌ఓలకు ఆదేశాలు జారీ అయ్యాయి. రెండు పంటలు పండే వ్యవసాయ భూములైతే ఎకరానికి మొదటి పంటకు రూ.200, రెండో పంటకు రూ.150 కలిపి మొత్తం రూ.350 నీటితీరువా వసూలు చేయనున్నారు. అదే ఆక్వా చెరువులైతే ఏడాదికి ఒకే పంట తీస్తారనే లెక్కలతో నీటితీరువా ఎకరానికి రూ.500గా పేర్కొన్నారు. నీటితీరువా వసూలుతోనే ఆగిపోకుండా కూటమి సర్కార్‌ రైతులపై సర్వీసు ట్యాక్స్‌ రూపంలో కూడా బాదేస్తోంది. నీటితీరువా కోసం జరిపే ప్రతి లావాదేవీకి అదనంగా రూ.35 సర్వీసు ట్యాక్స్‌ వసూలు చేయాలని ఆదేశించింది. దీనిని రైతుసంఘాల ప్రతినిధులు ఆక్షేపిస్తున్నారు. మునుపెన్నడూ ఇటువంటి సర్వీసు ట్యాక్స్‌ తాము చూడలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. నీటితీరువా, సర్వీ సు ట్యాక్స్‌ చూడటానికి తక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, గడచిన నాలుగేళ్లకు కలిపితే రైతులపై పెనుభారం పడుతుందని అంటున్నారు. పైగా, రైతు సాగు చేసే ప్రతి ఎకరానికి ఇది పెరుగుతూ పోతుంది.

వీఆర్‌ఓలకు భారం

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందనే సామెత చందంగా వీఆర్‌ఓల పరిస్థితి తయారైంది. నీటితీరువా వసూలు ప్రక్రియ వారికి ఆర్థికంగా భారం కానుంది. భూముల రీసర్వే అయిన గ్రామాల్లో నీటితీరువా వసూలు రెవెన్యూ యంత్రాంగానికి గుదిబండగా మారనుంది. రీసర్వే కాక ముందు 1433 ఫసలీలో అప్పటి వరకూ ఉన్న నీటితీరువా బకాయిలకు ఒక డిమాండ్‌ నోటీసు, రీసర్వే తరువాత వచ్చిన 1434 ఫసలీలో ఉన్న బకాయిలకు మరో డిమాండ్‌ నోటీసు జారీ చేయాలి. అంటే ఒక రైతుకు సంబంధించిన బకాయిల వసూలుకు వీఆర్‌ఓ రెండు డిమాండ్‌ నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. దీనికయ్యే ఖర్చుల విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలూ లేవు. ఈ నేపథ్యంలో గ్రామంలోని రైతులందరికీ రెండేసి నోటీసులు జారీ చేయాలంటే ఆర్థికంగా కుదేలైపోతామని వీఆర్‌ఓలు అంటున్నారు. కరప మండలంలోని ఒక మేజర్‌ గ్రామ పంచాయతీ వీఆర్‌ఓకు డిమాండ్‌ నోటీసులు జారీ చేసేసరికి రూ.18 వేల మేర చేతిచమురు వదిలిందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. ఈ ఖర్చులు ఎవరు భరిస్తారని వీఆర్‌ఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాయం చేయకుండా నీటితీరువా వసూలా?

వ్యవసాయ సీజన్‌ ప్రారంభమవుతోంది. రైతులు పెట్టుబడిలు కోసం నానా ఇబ్బందులూ పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకూ రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది. కానీ, అధికారంలోకి వచ్చి ఏడాదైపోతున్నా ఆ మాట నిలబెట్టుకోలేదు. ఇప్పుడు చూస్తే నీటితీరువాను బకాయిలతో సహా ఇప్పటికిప్పుడు ఒకేసారి వసూలు చేయడం సహేతుకం కాదు. చాలా ఏళ్లుగా నీటితీరువా వసూలు చేయడం లేదు. రైతులు కూడా ఈ విషయం పూర్తిగా మరచిపోయారు. అలాగే, రూ.35 సర్వీసు ట్యాక్స్‌ వసూలు నిర్ణయం కూడా వెనక్కు తీసుకోవాలి.

– రావుల ప్రసాద్‌, రైతు సంఘ ప్రతినిధి, కూరాడ, కరప మండలం

అన్నదాతపై భారం మోపేలా..

గత ప్రభుత్వ విధానానికి భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం రైతులను నానా ఇక్కట్లకూ గురి చేస్తోంది. గద్దెనెక్కగానే రైతులకు చేస్తానన్న సాయం చేయకపోగా వారిపై భారం మోపేలా నిర్ణయం తీసుకుంది. వ్యవసాయం దండగన్న చంద్రబాబు అందుకు తగ్గట్టుగానే రైతుల నెత్తిన అకస్మాత్తుగా నీటితీరువా గుదిబండ వేశారు. ఆయన గద్దెనెక్కాక రెండో వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైనా రైతుకు ఇస్తామన్న పెట్టుబడి సాయం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. పైగా ఇప్పుడు నీటితీరువా వసూలు చేయాలని రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై రైతులు మండిపడుతున్నారు. ఇంత కాలం అసలు నీటితీరువా అంటూ ఒకటి ఉందనే విషయాన్నే వారు మరచిపోయారు. అటువంటిది బకాయిలతో కలిపి నీటితీరువా వసూలు చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం సమాయత్తం కావడం రైతులను కలవరపాటుకు గురి చేస్తోంది.

మండలాల వారీగా 1434 ఫసలీలో నీటితీరువా డిమాండ్‌,

వసూలు వివరాలు (రూ.లు)

పెద్దాపురం రెవెన్యూ డివిజన్‌

మండలం డిమాండ్‌ వసూలు బ్యాలెన్స్‌

గండేపల్లి 10,47,383 ––– 10,47,383

జగ్గంపేట 27,99,974 ––– 27,99,974

కిర్లంపూడి 2,43,71,714 ––– 2,43,71,714

కోటనందూరు 93,36,189 12,81,971 80,54,218

పెద్దాపురం 1,13,36,038 5,39,959 1,07,96,079

ప్రత్తిపాడు 50,23,200 ––– 50,23,200

రౌతులపూడి 13,99,873 ––– 13,99,873

శంఖవరం 5,15,997 ––– 5,15,997

తొండంగి 1,04,34,976 4,93,142 99,41,834

తుని 26,04,969 ––– 26,04,969

ఏలేశ్వరం 70,82,381 ––– 70,82,381

మొత్తం 7,59,52,694 23,15,072 7,36,37,622

కాకినాడ రెవెన్యూ డివిజన్‌

పెదపూడి 99,31,430.94 4,08,077.00 95,23,353.87

కాజులూరు 82,41,762.46 2,73,796.00 79,67,966.46

పిఠాపురం 79,94,757.17 5,51,368.00 74,43,352.60

కరప 73,66,201.82 1,29,681.00 72,36,520.79

సామర్లకోట 59,89,496.35 2,17,637.00 57,71,853.53

గొల్లప్రోలు 33,94,159.40 41,203.00 33,52,954.44

కొత్తపల్లి 35,04,440.89 1,58,863.00 33,45,577.86

కాకినాడ రూరల్‌ 17,13,798.04 1,11,853.00 16,01,943.62

తాళ్లరేవు 16,32,013.18 77,327.00 15,54,686.13

కాకినాడ అర్బన్‌ 2,81,906.40 8,175.00 2,73,730.99

మొత్తం 5,00,49,966.65 19,77,980.00 4,80,71,940.03

జగన్‌ సర్కారులో ఆ ఊసే లేదు

రైతు పక్షపాతి అయిన గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అసలు నీటితీరువా అనేదే లేకుండా చేశారు. తద్వారా రైతుల నెత్తిన పాలు పోశారు. వాస్తవానికి నీటి తీరువాను గతంలో క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారులు వ్యక్తిగతంగా వసూలు చేసేవారు. ఈ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉండటంతో ఆన్‌లైన్‌ చేద్దామని నాటి జగన్‌ ప్రభుత్వం భావించింది. రాష్ట్రవ్యాప్తంగా నీటితీరువా డిమాండ్‌ రూ.350 కోట్లు మించి లేదు. అటువంటప్పుడు అదేమీ పెద్ద విషయం కాదనే ఉద్దేశంతో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నీటితీరువా వసూలుపై పెద్దగా దృష్టి పెట్టలేదు. తద్వారా రైతులకు మేలు చేసింది. దీంతో, సుమారు నాలుగేళ్లుగా వారికి రూపాయి కూడా నీటితీరువా చెల్లించాల్సిన అవసరం రాలేదు.

ఇదేం తీరువా బాబూ!1
1/1

ఇదేం తీరువా బాబూ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement