
విద్యా సంస్థల్లో ఈగిల్ క్లబ్బులు
● వచ్చే నెల 15 నాటికి ఏర్పాటు చేయాలి
● అధికారులకు కలెక్టర్ ఆదేశం
కాకినాడ సిటీ: మాదక ద్రవ్యాలను అరికట్టే చర్యల్లో భాగంగా వచ్చే నెల 15వ తేదీ నాటికి జిల్లాలోని అన్ని విద్యా సంస్థల్లో ఈగిల్ క్లబ్బులు ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. రహదారి భద్రతపై కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన సమావేశంలో జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్‌తో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా అధికారి కె.శ్రీధర్ మాట్లాడుతూ, ఈ ఏడాది మే నెల వరకూ జిల్లాలో 368 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, 163 మంది మృతి చెందారని, 408 మంది గాయపడ్డారని వివరించారు. అత్యధికంగా 145 ప్రమాదాలు జాతీయ రహదారులపై, 67 ప్రమాదాలు రాష్ట్ర రహదారులపై జరిగాయన్నారు. కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ, మోటారు వాహనాల చట్టం–1988 కింద రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి వారం రోజుల పాటు రూ.1.50 లక్షల వరకూ ఉచిత చికిత్స అందించేందుకు రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ స్కీమును జిల్లాలో పటిష్టంగా అమలు చేయా లని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఏడాది నుంచి రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగిన ప్రాంతాల స మాచారం ఆధారంగా రహదారులపై బ్లాక్ స్పాట్‌లను గుర్తించాలని ఎస్పీ బిందుమాధవ్ కోరారు.
1,444 కిలోల గంజాయి స్వాధీనం
అనంతరం జరిగిన నార్కో కో ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ, జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 22 గంజాయి నేరాలు నమోదయ్యాయని, 85 మందిని అరెస్టు చేసి 1,444 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు అందించేందుకు 1972, 14405 టోల్‌ఫ్రీ, 9494933233 వాట్సాప్ నంబర్లపై విస్తృత ప్రచారం చేయాలని కోరారు. జిల్లాలోని విద్యా సంస్థల్లో ఇప్పటి వరకూ 217 ఈగల్ క్లబ్బులు ఏర్పాటు చేసి, 420 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. డ్రగ్స్ ప్రమాదంపై సుమారు 30 వేల మంది విద్యార్థులను అవగాహన కల్పించామన్నారు. సారా నిర్మూలన కార్యక్రమం నవోదయం 2.0 కింద జిల్లాలో 560 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని అసిస్టెంట్ ఎకై ్సజ్ కమిషనర్ కె.జయమౌనిక తెలిపారు. ఈ సందర్భంగా డ్రగ్స్, సారా దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను కలెక్టర్, ఎస్పీ ఆవిష్కరించారు.
పారిశ్రామికవేత్తలకు సింగిల్‌విండోలో అనుమతులు
ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి అందిన దరఖా స్తులకు సింగిల్‌విండో విధానంలో త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం జరిగిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. గత మూడు నెల ల కాలంలో వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతులు కోరుతూ మొత్తం 556 దరఖాస్తులు అందగా, సింగిల్ డెస్క్ విధానంలో ఆయా శాఖల ద్వారా 492 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశామని చెప్పారు. ఉత్పాదన, సేవా రంగాల్లోని 14 యూనిట్లకు సుమారు రూ.40 లక్షలు విలువైన రాయితీల జారీకి కమిటీ ఆమోదించిందన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.