
రూ.26,409 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాకు రూ.26,409 కోట్లతో రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ షణ్మోహన్ సగిలి మంగళవారం ఆవిష్కరించారు. బ్యాంకులు, వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన జిల్లా కన్సల్టేటివ్ కమిటీ, జిల్లా స్థాయి రుణాల లక్ష్య సాధన ప్రగతి సమీక్ష కమిటీ సమావేశాలు కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వ్యవసాయ, అనుబంధ రంగాలు, పరిశ్రమలు, ఇతర ప్రాధాన్య రంగాలకు వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం రుణాలివ్వాలని అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలకు మించి రుణాలిచ్చినందుకు బ్యాంకర్లకు అభినందించారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు మరింత చొరవ చూపాలని కోరారు. ఈ రుణాల ప్రగతిపై ప్రతి వారం సమీక్షిస్తామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 10,500 మంది మంది కౌలు రైతులకు క్రాప్ కల్టివేటర్ రైట్స్ (సీసీఆర్) కార్డులు జారీ చేయగా, 8 వేల మంది రైతులు పంట రుణాల కోసం బ్యాంకులకు దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కమిటీ కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ రీజినల్ హెడ్ వి.కృష్ణమాచారి, ఎల్‌డీఎం, సీహెచ్‌ఎస్‌వీ ప్రసాద్, రిజర్వ్ బ్యాంకు ఎల్‌డీఓ ఎ.రామకృష్ణ, నాబార్డ్ ఏజీఎం వై.సోమునాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.