
కోకో సాగు విస్తీర్ణం గుర్తింపునకు ఈ–క్రాప్
దేవరపల్లి: ఈ–క్రాప్ బుకింగ్ ద్వారా జిల్లాలో కోకో సాగు విస్తీర్ణాన్ని గుర్తిస్తామని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. నల్లజర్ల మండలం చోడవరంలో సోమవారం కోకో తోటలను ఆమె పరిశీలించి, రైతులతో మాట్లాడారు. కోకో రైతులు ఈ–క్రాప్ బుకింగ్ చేయకపోవడం వల్ల వివరాలు తెలుసుకోవడంలో జాప్యం జరుగుతోందని చెప్పారు. ఈ–క్రాప్ బుకింగ్ సమయంలో ఏ రైతు ఏ పంట సాగు చేస్తున్నారనే వివరాలను తప్పకుండా నమోదు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులుండవని ఉద్యానవన శాఖ అధికారులకు సూచించారు. నల్లజర్ల మండలంలో 457 ఎకరాల్లో అంతర పంటగా కోకో సాగు చేస్తున్నట్లు కలెక్టర్‌కు అధికారులు వివరించారు. కోకో రైతుల నుంచి ప్రతి గింజా కొనుగోలు చేసేందుకు మద్దతు ఇస్తామని కలెక్టర్ తెలిపారు. కోకో రైతుల నుంచి కంపెనీలు కిలో రూ.500 చొప్పున కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రైతు కొత్తపల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ, కిలో కోకో గింజలకు రూ.500 ధర ప్రకటించడం రైతులకు, కంపెనీలకు ఆమోదయోగ్యంగా ఉందని అన్నారు.