
సీతారాములకు వెండి మకర తోరణం అలంకరణ
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు నిర్వహించే నిత్య కల్యాణంలో పెళ్లిపెద్దలుగా వ్యవహరించే క్షేత్ర పాలకులు సీతారాములకు శనివారం వెండి మకర తోరణం అలంకరించారు. దీంతో, స్వామి, అమ్మవార్లు ప్రత్యేక శోభతో ప్రకాశించారు. గతంలో నిత్య కల్యాణం సందర్భంగా సత్యదేవుడు, అమ్మవార్లను వెండి సింహాసనంపై వేంచేయించి, వారి పాదాల దగ్గరలో సీతారాములను ఉంచేవారు. దీంతో, సత్యదేవుడు, అమ్మవారిపై వేసిన అక్షింతలు, తలంబ్రాలు సీతారాములపై కూడా పడేవి. భక్తులు దీనిని అపచారంగా భావించేవారు. దీనిపై ‘సత్యదేవుని నిత్య కల్యాణంలో అపచారం’ శీర్షికన గత ఏడాది జూన్ 24న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన అప్పటి ఈఓ, ప్రస్తుత కమిషనర్ కె.రామచంద్ర మోహన్ సత్యదేవుడు, అమ్మవారి సింహాసనం పక్కనే సీతారాములను మరో ఆసనంపై ఉంచి, నిత్య కల్యాణం నిర్వహించాలని ఆదేశించారు. అప్పటి నుంచీ అలాగే చేస్తున్నారు. అయితే, సత్యదేవుడు, అమ్మవార్ల మాదిరిగా సీతారాముల ఉత్సవ మూర్తుల వెనుక మకర తోరణం లేకపోవడంతో బోసిపోయినట్టుండేది. ఈ నేపథ్యంలో వ్రత పురోహిత సూపర్‌వైజర్లు అల్లంరాజు సత్య శ్రీనివాస్, గుత్తిన రామకృష్ణ, వ్రత పురోహిత సంఘం మాజీ అధ్యక్షుడు రవిశర్మ, వారి డ్యూటీ సభ్యులు 43 మంది కలసి రూ.3 లక్షలతో 345 గ్రాముల వెండితో మకర తోరణం తయారు చేయించి సీతారాములకు ఈ నెల 12న సమర్పించారు. దీనిని ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం సీతారాములకు అలంకరించారు. ఇక నుంచి ప్రతి రోజూ సీతారాములకు ఇదేవిధంగా మకర తోరణం అలంకరించి సత్యదేవుని నిత్య కల్యాణం నిర్వహిస్తామని అధికారులు చెప్పారు.
145 మంది వైద్యుల నమోదు
కాకినాడ క్రైం: రంగరాయ వైద్య కళాశాల (ఆర్‌ఎంసీ) డిజిటల్ లైబ్రరీలో జిల్లా స్థాయి వైద్యుల నమోదు ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. ఏపీ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యాన కళాశాల నిర్వహణలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరిగింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 145 మంది వైద్యులు హాజరై లైసెన్స్ రెన్యువల్స్, రీ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఐఎంఏ కాకినాడ కార్యదర్శి డాక్టర్ చిట్ల కిరణ్ తెలిపారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు ఈ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు. దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోనే జిల్లాల పరిధిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఐఎంఏ కాకినాడ అధ్యక్షుడు డాక్టర్ మోకా పవన్‌కుమార్, రామ్‌కోసా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ఎంవీ ఆనంద్, డాక్టర్ ఆదిత్య సత్యప్రసన్న మాట్లాడుతూ, విజయవాడలోని ఏపీ మెడికల్ కౌన్సిల్ నుంచి 15 మంది నిష్ణాతులైన సిబ్బంది వచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ, ఉమ్మడి విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఇదే తరహా రిజిస్ట్రేషన్లు నిర్వహించారన్నారు. తగిన నమోదు లేకుండా ప్రాక్టీస్ చేయడం నేరమని, లైసెన్సు పునరుద్ధరణ తప్పనిసరని పేర్కొన్నారు. ఆదివారం నిర్వహించే నమోదు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రక్రియను ఐఎంఏ పూర్వపు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జీఎస్ మూర్తి, డాక్టర్ సంపత్‌కుమార్, ఆర్‌ఎంసీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమామహేశ్వరరావు పరిశీలించారు.
అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు
పెరవలి: ఏకాదశి పర్వదినం కావడంతో అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే వందలాదిగా భక్తుల రాక ప్రారంభమైంది. ఆలయ ప్రాంగణం చుట్టూ భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరి మరీ స్వామిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నా రు. వందలాది మంది భక్తులు తలనీలాలు సమ ర్పించారు. అభిషేకం నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లను అర్చకులు విశేషంగా అలంకరించి, భక్తులను దర్శనానికి అనుమతించారు.

సీతారాములకు వెండి మకర తోరణం అలంకరణ