
ఆధ్యాత్మికతకు ధర్మ పరిక్రమణ యాత్ర
దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు
ఆలమూరు: హిందూ ధర్మ పరిరక్షణ, హిందూ మత వ్యాప్తి కోసం ధర్మ పరిక్రమణ యాత్ర చేపట్టి గ్రామీణ, తీర ప్రాంతాల్లో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు దాస సాహిత్య ప్రాజెక్టు తీవ్రంగా కృషి చేస్తోందని ప్రత్యేక అధికారి విద్వాన్ పగడాల ఆనంద తీర్థాచార్యులు తెలిపారు. ఆలమూరు మండలం జొన్నాడలో మూడు రోజుల నుంచి జరుగుతున్న శ్రీపురందరదాసు సంకీర్తనల శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వేద, ఉపనిషత్, పురాణాల సారాంశాన్ని రంగరించి పురందరదాసు సుమారు 4.70 లక్షల సంకీర్తనలు రచించారన్నారు. ఈ కీర్తనలన్నీ కన్నడ భాషలో ఉండడం వల్ల అందులో ఉన్న సారాన్ని తెలుగు వారికి అర్థమయ్యే విధంగా తర్జుమా చేయించామన్నారు. ఆ కీర్తనలు ఆలపించే విధానాన్ని భజన మండలి సభ్యులకు నేర్పడానికి ఏటా మహిళా భక్త బృంద సభ్యులకు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. దాస సాహిత్య ప్రాజెక్ట్‌లో భాగంగా కోస్తా జిల్లాల్లో ప్రస్తుతం 4,862 భజన మండళ్లు ఉండగా వీటిల్లో 8,694 మంది మహిళా సభ్యులు ఉన్నారని తెలిపారు. దాస సాహిత్య ప్రాజెక్ట్‌లో ఉన్న హరే శ్రీనివాస భక్తభజన మండళ్ల సభ్యులందరూ సంకీర్తన యజ్ఞంతో పాటు కోలాటానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కొనియాడారు. దాస సాహిత్య ప్రాజెక్టు విస్తరణకు, నిర్వహణకు టీటీడీ రూ.2.50 కోట్లు మంజూరు చేసిందని ఆయన చెప్పారు.
హిందుత్వం వైపు ఆకర్షితులను చేస్తాం
గిరిజనులు, దళితులు దాస సాహిత్య ప్రాజెక్టు పట్ల ఆసక్తి కనబర్చి హిందూత్వం వైపు అకర్షించేలా ఈ ధర్మ పరిక్రమణ యాత్ర దోహదపడుతుందని ఆనంద తీర్థాచార్యులు తెలిపారు. మత మార్పిడుల నివారణకు టీటీడీ ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. హిందుత్వానికి ఉన్న వైభవాన్ని వివరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా జూలై 15న ధర్మ పరిక్రమణ యాత్రను ప్రారంభిస్తున్నామన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో హరే శ్రీనివాస భజన మండళ్ల ఏర్పాటులో, నిర్వహణలో ఆలమూరు అయ్యప్ప స్వామి ఆలయ నిర్వాహకులు ముకుంద స్వామి కృషి ప్రశంసనీయమని అన్నారు.