
25 నుంచి నైపుణ్యాభివృద్ధి శిక్షణ
కాకినాడ సిటీ: దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూజీకేవై) సెంటర్ ఆధ్వర్యాన ఈ నెల 25 నుంచి కాకినాడ వాకలపూడిలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్లు వికాస పీడీ లచ్చారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా పాసైన 18 నుంచి 30 సంవత్సరాలలోపు పురుష అభ్యర్థులు దీనికి అర్హులన్నారు. టూ వీలర్ టెక్నీషియన్, వేర్‌హౌస్ ఎగ్జిక్యూటివ్ కోర్సులలో వీరికి మూడు నెలలు శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతి, యూనిఫాం, స్టడీ మెటీరియల్ అందిస్తారన్నారు. ఈ కోర్సులతో పాటు అదనంగా బేసిక్ కంప్యూటర్ కోర్సు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్‌పై శిక్షణ ఇస్తారని తెలిపారు. అనంతరం, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం కల్పించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ద్వారా సర్టిఫికెట్ ఇస్తారని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 24వ తేదీలోపు 83284 83297, 89784 75164 నంబర్లలో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా చెల్లించవద్దని, నేరుగా తమ కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని లచ్చారావు స్పష్టం చేశారు.
యోగా దినోత్సవాన్ని
విజయవంతం చేయాలి
కాకినాడ సిటీ: జిల్లావ్యాప్తంగా శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని అధికారులను కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. ఈ అంశంపై కలెక్టరేట్ నుంచి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కాకినాడ నూకాలమ్మ గుడి నుంచి మూడు లైట్ల జంక్షన్, దేవదాయ శాఖ కార్యాలయం వరకూ 3 వేల మందితో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. దీనికి పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో గుర్తించిన వేదికల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలను భాగస్వాముల్ని చేస్తూ యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమానికి సుమారు 10.38 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన, అదనపు ఎస్పీ ఎంజేవీ భాస్కరరావు, డీఆర్‌ఓ జె.వెంకటరావు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఆయుష్ వైద్యాధికారులు పాల్గొన్నారు.