
వేతనాల ఆలస్యం రివాజే!
అన్నవరం: రత్నగిరిపై పారిశుధ్య కార్మికుల వేతన కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. 18వ తేదీ వచ్చినా ఈ నెల జీతాల బిల్లు సిద్ధం చేసిన దాఖలాలు లేకపోవడంతో దేవస్థానంలోని 349 మంది కార్మికులు మూడో నెలలో కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. బిల్లు తయారై ఆడిట్‌కు వెళ్లి పాసై వస్తే అప్పుడు చెక్కుపై ఈఓ సంతకం చేయడం, దానిని ఆన్‌లైన్‌లో కాంట్రాక్టర్‌కు బదలాయించడం, ఆయన సదరు కార్మికుల అకౌంట్లలో జమచేయడం ఈ ప్రక్రియంతా కనీసం వారం రోజుల ప్రహసనం. అంటే 25వ తేదీ దాటితే తప్ప కార్మికులకు మే నెల జీతాలు పడని పరిస్థితి.
గత రెండు నెలలూ ఆలస్యమే..
ఆలయంలో కార్మికులకు వేతనాలు ఆలస్యంగా చెల్లించడం రివాజైపోయింది. మార్చి నెల జీతాలు ఏప్రిల్ 30న, ఏప్రిల్ నెల జీతాలు మే 28న చెల్లించారు. ఏప్రిల్ 25న ‘మాకు జీతాలు ఎప్పుడిస్తారు స్వామీ...? అంటూ సాక్షిలో ప్రచురితమైన కథనానికి, మే 26న ప్రచురితమైన ‘వీరి కష్టం తుడిచేవారేరీ’ కథనాలకు స్పందించి అధికారులు ఆ తేదీలకై నా వారి అకౌంట్లలో జమ చేయగలిగారు. ఇందులో కూడా ఏప్రిల్ నెలకు సంబంధించి రూ.లక్ష కోత పెట్టి రూ.58 లక్షలు విడుదల చేశారు. అయితే మొత్తం నిధులు వస్తేకానీ చెల్లించనని కాంట్రాక్టర్ చెప్పడంతో జూన్ ఒకటో తేదీకి కానీ జమ చేయలేదు.
కాంట్రాక్టర్ వల్లే ఆలస్యం
దేవస్థానానికి పారిశుధ్య సిబ్బందిని సరఫరా చేస్తున్న గుంటూరుకు చెందిన కనకదుర్గా ఏజెన్సీ సకాలంలో పీఎఫ్ జమ చేయకపోవడం, బిల్లు అందచేయకపోవడం వల్లే జీతాల చెల్లింపు ఆలస్యమవుతోందని అధికారులు పదే పదే చెప్తున్నారు.
ఏజెన్సీకి స్థోమత లేకపోయినా..
హైదరాబాద్‌కు చెందిన కేఎల్‌టీఎస్ సంస్థ రెండేళ్లకు పైగా దేవస్థానంలో పారిశుధ్య విధులు నిర్వహించింది. ఆ సంస్థ ప్రతి నెల పదో తేదీనే సిబ్బందికి జీతాలు చెల్లించేది. గత నవంబర్‌తో ఆ సంస్థ గడువు ముగిసినా టెండర్ ద్వారా కొత్త సంస్థను కాంట్రాక్టుకు ఎంపిక చేసే వరకు విధులు కొనసాగించాలని అధికారులు కోరడంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు కాంట్రాక్టు కొనసాగింది. మార్చి ఒకటో తేదీ నుంచి ఆ కాంట్రాక్టు గుంటూరుకు చెందిన కనకదుర్గా ఏజెన్సీకి అప్పగించారు. ఆ సంస్ధకు 349 మందికి జీతాలు ఇచ్చే స్థోమత లేకపోయినా అధికారులు నామినేషన్ పద్ధతిపై ఇచ్చినట్టుగా హడావిడిగా విధులు కట్టబెట్టారు. దీంతో ఆ సంస్థపై ఏ విధమైన చర్యలూ తీసుకోలేని పరిస్థితిని అధికారులే కల్పించుకున్నారు. కానీ సకాలంలో జీతాలు అందక పారిశుధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బాధితురాలికి న్యాయం చేస్తాం
రాజమహేంద్రవరం రూరల్: పెళ్లి చేసుకుంటాడని నమ్మి మోసపోయిన బాధితురాలికి అన్ని విధాలా న్యాయం చేస్తామని జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారిత అధికారి బి.శశాంక ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒక మహిళ తన కుమార్తెను పులవర్తి సత్యదేవ్ తన కుమార్తెను ప్రేమించి మోసం చేశాడని ఓ మహిళ కలెక్టర్ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళాభివృద్ధి, సంక్షేమశాఖ, వన్‌స్టాప్ సెంటర్ విచారణ జరిపింది. బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌లో పలుమార్లు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చామని, తమకు పదిరోజులు గడువు కావాలని కోరగా, బొమ్మూరు ఇన్‌స్పెక్టర్ వారం రోజులు గడువు ఇచ్చారని పేర్కొన్నారు. బాధితురాలిని సత్యదేవ్ వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో ఈనెల 13న అతనిపై పోక్సో కేసు నమోదు చేశారని, ప్రస్తుతం అతడు రిమాండ్‌పై సెంట్రల్ జైల్‌లో ఉన్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారన్నారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ఉంచారన్నారు.
రత్నగిరిపై కొనసాగుతున్న పారిశుధ్య కార్మికుల కష్టాలు
వరుసగా మూడో నెలా ఆలస్యం సగం నెల దాటినా సిద్ధం కాని బిల్లు