కడతేరి.. కన్నీరు మిగిల్చి.. | - | Sakshi
Sakshi News home page

కడతేరి.. కన్నీరు మిగిల్చి..

Jun 3 2025 12:14 AM | Updated on Jun 3 2025 12:14 AM

కడతేర

కడతేరి.. కన్నీరు మిగిల్చి..

కోనేటిలో మునిగి కొడుకు, మనవడు మృతి

తల్లడిల్లిన వృద్ధ దంపతుల కన్నపేగు

తండ్రీకొడుకుల మృతితో బొర్రంపాలెంలో విషాదం

గండేపల్లి: వృద్ధాప్యంలో తోడుగా ఉంటాడనుకున్న కొడుకు, మనవడు మృత్యువాత పడడం ఆ ముసలి దంపతులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. కన్న కొడుకు, మనవడు ఒకేసారి దూరమవడంతో ఆ కన్నపేగు తల్లడిల్లింది. ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బొర్రంపాలేనికి చెందిన సాగి శ్రీరామమూర్తి (బూరయ్య), నాగరత్నం దంపతులకు కొడుకు నల్లబాబు(46), కుమార్తెలు సీతఆదిలక్ష్మి, సుగుణ ఉన్నారు. వీరికి వివాహాలు కాగా, నల్లబాబు వ్యాపారం కోసం భార్య నాగతులసి, కుమారుడు సంజయ్‌ శ్రీరామ్‌(19), కుమార్తె సరస్వతితో హైదరాబాద్‌లో ఉంటున్నాడు. సరస్వతి ఈ ఏడాది టెన్త్‌ పరీక్షలు రాసింది. ఇటీవల కాలంలో నల్లబాబు ఒంటరిగా సొంతూరు వచ్చి తల్లిదండ్రులకు తోడుగా ఉంటూ, వ్యవసాయం చేస్తున్నాడు. సంజయ్‌ శ్రీరామ్‌ చదువు కోసం విశాఖపట్నంలో ఉంటున్నాడు. ఇటీవల అతడు ఇంటికి వచ్చాడు. కాగా సోమవారం వలసపాకల గ్రామానికి పరామర్శకు వెళ్లిన నల్లబాబు, సంజయ్‌ శ్రీరామ్‌ మైలు శుద్ధి స్నానానికి సాయంత్రం తాళ్లూరు వచ్చారు. కోనేరులో దిగిన సంజయ్‌ శ్రీరామ్‌ మునిగిపోతుండగా నల్లబాబు రక్షించేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరూ నీట మునిగి మృతి చెందారు. ఆ సమయంలో ఎవరూ గుర్తించకపోవడంతో కాపాడేందుకు వీల్లేకుండా పోయిందని స్థానికులు అంటున్నారు.

తల్లి వద్దకు వెళ్లాల్సి ఉండగా..

హైదరాబాద్‌లో ఇంటర్‌ పూర్తి చేసిన సంజయ్‌ శ్రీరామ్‌ విశాఖపట్నంలో హాస్టల్‌లో ఉంటూ, రఘు ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో బీటెక్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ఉన్న తల్లి, చెల్లి వద్దకు వెళ్లాల్సి ఉందని, ఇంతలోనే ఇలా జరిగిపోయిందని బంధువులు, స్నేహితులు వాపోయారు. మృదుస్వభావి, సౌమ్యుడు, అందరితో కలిసిమెలిసి ఉండే నల్లబాబు ఇలా దూరం కావడం బాధాకరంగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చదువు, ఇల్లు తప్ప వేరే ధ్యాస లేని సంజయ్‌ చిన్న వయస్సులోనే దూరమయ్యాడని స్నేహితులు వాపోయారు. బొర్రంపాలెం గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో కోనేరు నుంచి మృతదేహాలను వెలికితీశారు. సంఘటనా స్థలాన్ని సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కడసారి చూపు కోసం..

కొడుకు, మనవడు ఒకేసారి శాశ్వతంగా దూరమవ్వడంతో కదల్లేని స్థితిలో ఉన్న శ్రీరామమూర్తి, నాగరత్నం వద్దకు అంబులెన్స్‌లో మృతదేహాలను బొర్రంపాలెం తీసుకువెళ్లారు. కొడుకు, మనవడిని చూసి ఆ వృద్ధ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటన గ్రామస్తులను కంటతడి పెట్టించింది.

తమ్ముడూ.. అప్పుడే నీకు నూరేళ్లూ నిండాయా.. నన్ను అక్క అని ఎవరు పిలుస్తారురా.. నన్ను అత్తా అని ఎవరు పిలుస్తారురా...అంటూ మృతదేహాలను పట్టుకుని సుగుణ విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

కడతేరి.. కన్నీరు మిగిల్చి..1
1/1

కడతేరి.. కన్నీరు మిగిల్చి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement