
సమస్యలపై ప్రజాపోరు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సమస్యలపై ప్రజా భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని మేలుకొల్పేలా పోరుబాటకు వైఎస్సార్ సీపీ సిద్ధమవుతోంది. ఇందుకు పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా రానున్న రెండు నెలల్లో మండల, గ్రామ కమిటీల నియామకాలు పూర్తి చేయాలని పార్టీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పార్టీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే జూన్ లోగా ఇంకా మిగిలిన మండలాలు, జూలైకల్లా గ్రామ స్థాయి కమిటీల నియామకాలు పూర్తి చేయాలని సూచించారు. కాకినాడ డి–కన్వెన్షన్‌లో శుక్రవారం జరిగిన పార్టీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమవ్వాలనేది ప్రధాన అజెండాగా నిర్ణయించారు. ఇందుకోసం ప్రజల సమస్యలపై పార్టీ స్థానిక నాయకత్వాలు శాంతియుత పంథాలో నిరసన కార్యక్రమాలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇటీవల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి నాయకత్వాన నిర్వహించిన ఆందోళనలపై ఈ సమీక్షలో చర్చించారు. ఇదే తరహాలో సమస్యలపై పోరుబాటకు సన్నద్ధం కావాలని నేతలకు బొత్స సూచించారు. జిల్లా స్థాయిలో సైతం పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని తీర్మానించారు. దీని కోసం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 50 రోజుల కార్యక్రమాన్ని ఖరారు చేశారు. వచ్చే జూన్ 1 నుంచి ప్రతి 10 రోజులకు ఒక జిల్లాలో పార్టీ జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాలను ఐదు జిల్లాల్లో 50 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.
రైతులకు అండగా..
ఫ ప్రధానంగా వివిధ సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు అండగా నిలవాలని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారని బొత్స తెలిపారు. కళ్లాల్లో ధాన్యం ఉన్నా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయంపై ఈ సందర్భంగా చర్చించారు. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెబుతున్న మాటలకు.. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితికి అసలు పొంతనే లేదని నేతలు సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. ఈ విషయంలో రైతుల ఇబ్బందులు తెలుసుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించి, వారితో మాట్లాడి, అండగా నిలవాలని నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు.
ఫ ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణమని నిర్ధారించారు. రొయ్యల ధరలు పడిపోవడం, మేత ధరలు అడ్డగోలుగా పెరిగిపోయి రైతులు నష్టపోతున్నా సర్కార్‌కు చీమ కుట్టినట్టయినా లేదని, ఆక్వా రైతులకు వెన్నంటి నిలవాలని తీర్మానించారు.
ఫ గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మాదిరిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పొగాకు రైతులకు అండగా నిలిచి, పోరాడటానికి సిద్ధంగా ఉండాలని నిర్ణయించారు.
ఫ ప్రధానమైన ప్రజా సమస్యలపై పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్షేత్ర స్థాయిలో పర్యటించేందుకు సైతం సిద్ధంగా ఉన్నారని బొత్స వివరించారు.
ఫ సూపర్ సిక్స్ సహా కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలయ్యే వరకూ ప్రభుత్వంపై ప్రజాపోరులో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేలా బాధ్యత తీసుకోవడానికి నాయకులు ముందుకు వచ్చారు.
ఫ క్షేత్ర స్థాయిలో పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, పార్టీ శ్రేణులు, ప్రజలకు అండగా నిలిచి, మనోధైర్యం కల్పించాలని తీర్మానించారు.
సమావేశంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, పండుల రవీంద్రబాబు, అనంత బాబు, బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణరావు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, పార్టీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రులు పినిపే విశ్వరూప్, తానేటి వనిత, తోట నరసింహం, గొల్లపల్లి సూర్యారావు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పార్టీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎంపీలు వంగా గీత, చింతా అనురాధ, మార్గాని భరత్‌రామ్, గిరజాల స్వామినాయుడు, పార్లమెంటరీ కో ఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పొన్నాడ సతీష్ కుమార్, జ్యోతుల చంటిబాబు, రౌతు సూర్యప్రకాశరావు, తలారి వెంకట్రావు, గెడ్డం శ్రీనివాసనాయుడు, పాముల రాజేశ్వరిదేవి, అంగూరి లక్ష్మీశివకుమారి, అసెంబ్లీ కో ఆర్డినేటర్లు ముద్రగడ గిరిబాబు, పిల్లి సూర్యప్రకాష్, పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, మహిళా నేతలు రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మేడపాటి షర్మిలారెడ్డి, సుంకర శివప్రసన్న, జమ్మలమడక నాగమణి, పతివాడ నూక దుర్గారాణి, గాధంశెట్టి శ్రీదేవి, నేతలు సుంకర విద్యాసాగర్, అల్లి రాజబాబు, రాగిరెడ్డి బన్నీ, గండేపల్లి బాబీ, వాసిరెడ్డి జమీలు, చెల్లుబోయిన శ్రీనివాస్, గొల్లపల్లి డేవిడ్, మార్గాని గంగాధరరావు, పేరి శ్రీనివాసరావు, గుత్తుల మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ప్రజలతో నేతలు మమేకమవ్వాలి
ఫ ధాన్యం కొనుగోళ్లపై రైతులకు అండ
ఫ ఆక్వా రైతులకు వెన్నుదన్ను
ఫ క్షేత్ర స్థాయి పర్యటనలకు అధినేత జగన్
ఫ ప్రతి 10 రోజులకు
వైఎస్సార్ సీపీ జిల్లా సమావేశం
ఫ జూన్ లోగా మండల కమిటీలు
ఫ జూలైనాటికి గ్రామ కమిటీలు
ఫ కాకినాడ సమీక్షలో పార్టీ నేత
బొత్స దిశానిర్దేశం

సమస్యలపై ప్రజాపోరు