
ధూప, దీప నైవేద్యాలకు దరఖాస్తుల ఆహ్వానం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): గ్రామాల్లో ఆదాయం లేని ఆలయాలకు ధూప, దీప నైవేద్యాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా దేవదాయశాఖాధికారి సుబ్బారావు తెలిపారు. కాకినాడ దేవదాయశాఖ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో ఉన్న చిన్న ఆలయాల్లో ఆదాయం లేకపోవడంతో ధూప, దీప నైవేద్యాలకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆయా ఆలయాలకు ప్రతీ నెలా రూ.10 వేలు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. దరఖాస్తులను స్థానిక ఎమ్మెల్యే ద్వారా అందివ్వాలన్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చిన్న ఆలయాలకు చెందిన కమిటీ సభ్యులు, అర్చకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అన్నవరం దేవస్థానం వైదిక
కమిటీ పునర్ వ్యవస్థీకరణ
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో వైదిక కమిటీని పునర్ వ్యవస్థీకరించారు. కమిటీలో ఆరుగురు సభ్యులకు అదనంగా మరో ఇద్దరు పండితులను నియమించారు. గొల్లపల్లి గణపతి ఘనపాఠీ, వేదుల సూర్యనారాయణ ఘనపాఠీ, గంగాధరబట్ల గంగబాబు ఘనపాఠీ, ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్శింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యశర్మ, వ్రత పురోహిత స్పెషల్‌గ్రేడ్ సూపర్‌వైజర్ ఛామర్తి కన్నబాబు వైదిక కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరితో బాటు చిట్టి శివ ఘనపాఠీని, వ్రత పురోహితుడు పాలంకి పట్టాభిరామ్మూర్తిని సభ్యులుగా చేర్చారు. ఈ ఎనిమిది మంది దేవస్థానంలో జరిగే వైదిక కార్యక్రమాల గురించి చైర్మన్, ఈఓలకు సలహాలిస్తారు.