● రూ.20 వేల చొప్పున జరిమానా
కాకినాడ లీగల్: పథకం ప్రకారం భర్తను హత్య చేసిన కేసులో భార్యకు, ఆమె ప్రియుడికి జీవితఖైదు, రూ.20 వేల చొప్పన జరిమానా విధిస్తూ కాకినాడ మూడో అదనపు జిల్లా జడ్జి పి.కమలాదేవి బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. మద్దూరి శామ్యూల్‌తో విజయ కమారికి 2007లో వివాహం అయింది. వివాహం అనంతరం కాకినాడ జగన్నాథపురం, జమ్మి చెట్టు సెంటర్‌లో నివాసం ఉండేవాడు. శామ్యూల్ భార్య మద్దూరి విజయకుమారికి తన స్నేహితుడు రాజమహేంద్రవరానికి చెందిన ఈపి గోపితాతారావుతో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో 2013 జూన్ 20వ తేదీన శామ్యూల్‌ను అడ్డు తప్పించడానికి పథకం ప్రకారం భార్య పాలలో నిద్రమాత్రలు కలిపి శామ్యూల్‌కు ఇవ్వడంతో నిద్రలోకి వెళ్లగా స్కిప్పింగ్ వైరుతో గొంతు బిగించి హత్య చేశారు. మృతుడు తండ్రి మద్దూరి ప్రభుదాసు ఇచ్చిన ఫిర్యాదుపై అప్పటి కాకినాడ వన్ టౌన్ ఎస్సై పెద్దిరెడ్డి రామచంద్రరావు కేసు నమోదు చేయగా అప్పటి సీఐ జి.దేవకమార్ దర్యాప్తు చేశారు. కోర్టు విచారణలో భార్య విజయకమారి, ఆమె ప్రియుడుపై నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.ఆదిత్యకుమార్ వాదనలు వినిపించారు.