
పొంచి ఉన్న ముప్పు
కందకాలు, డ్రెయినేజీలపై అక్రమ నిర్మాణాలు
ఇక్కడా అదే పరిస్థితి
2009లో వచ్చిన వరదల దాటికి అయిజ, అలంపూర్, వడ్డేపల్లి పట్టణాలు జలదిగ్బంధం అయ్యాయి. అలంపూర్ పట్టణం మొత్తం పూర్తిగా నీటి మునిగింది. వడ్డేపల్లి పట్టణంలోని పలు కాలనీలు జలమయ్యాయి. ఆ జ్ఞాపకాలు, వరద ఆనవాళ్లు ఇంకా కళ్లు ముందే ఉన్నాయి. అయిజలో ఉన్న పెద్దవాగు పొంగిపొర్లింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పెద్దవాగు సైతం కొన్ని చోట్ల ఆక్రమణలకు గురైంది.
● భారీ వర్షాలకు నీరు ముందుకు పారక.. లోతట్టు ప్రాంతాలు జలమయం
● మున్సిపాలిటీల్లో కానరాని శాశ్వత చర్యలు
● నోటీసులతో సరిపెడుతున్న అధికారులు
గద్వాలటౌన్: హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ నగరాలను చూశారు కదా.. గతంలో కురుసిన భారీ వర్షాలకు కాలనీలు, ఇళ్లు నిండా మునిగి జనం అతలాకుతలమయ్యారు. అలాంటి పరిస్థితి జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలకు రానుందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. గతంలో కురిసిన భారీ వర్షాలకు ఆయా పట్టణాలు పూర్తిగా నీటమునిగి తేటతెల్లం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రోజు కురుస్తున్న వర్షాలకు కూడా పట్టణాలలోని లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీరు వచ్చి చేరే అవకాశం ఉంది.
జిల్లా కేంద్రం ఆగమాగం
చారిత్రక పట్టణం, వాణిజ్యపరంగా విరాజిల్లుతున్న జిల్లా కేంద్రమైన గద్వాల పట్టణం కబ్జాలకు చిరునామాగా మారుతోంది. కందకాలు, డ్రెయినేజీ స్థలాలపై ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. హద్దులు చెరిపేసి మరీ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం గద్వాలలో కందకాలు, డ్రెయినేజీల ఆక్రమణలతో కొనసాగుతున్న జల బీభత్సం మాదిరిగా గద్వాల పట్టణానికి ముప్పు పొంచి ఉంది. ఎందుకంటే ఇక్కడ నాలాల ఆక్రమణలు కొనసాగుతున్నాయి. అనుమతులకు విరుద్ధగా అడ్డగోలు నిర్మాణాలు చేపట్టడం భవిష్యత్ ప్రమాదాన్ని కొనితెచ్చేలా ఉంది. గద్వాలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిస్తే కాలనీలు జలమయ్యే పరిస్థితులు ఉన్నాయి. 2007, 2009లలో కురిసిన భారీ వర్షాలకు గద్వాల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలతో పాటు ఎగువ ప్రాంతంలో ఉన్న కాలనీలు సైతం జలమయ్యాయి. చారిత్రక గద్వాల పట్టణంలో కందకాల పాత్ర ఎంతో కీలకం. గతంలో పట్టణాన్ని పాలించిన కాలంలో రక్షణ కోసం పట్టణం చుట్టూ కందకాలను నిర్మించారు. సుమారు 50 అడుగుల వెడల్పు, 30 అడుగులకుపైగా లోతుతో గతంలో ఉండేవి. అయితే కాలక్రమేణా పట్టణ విస్తరిస్తుండటంతో ఒకప్పుడు పట్టణం చుట్టూ ఉన్న కందకాలు ఇప్పుడు పట్టణం నడిబొడ్డుకు చేరాయి. కొంతమంది అక్రమార్కులు స్వార్థంతో ఈ కందకాల స్థలాలను ఆక్రమించుకొన్నారు. 50 అడుగుల వెడల్పుతో ఉన్న కందకాలు ఐదారు అడుగులకు కుదించుకుపోయాయి. ప్రధానంగా 13, 27, 28, 30, 36, 37 వార్డుల పరిధిలో ఉన్న కందకాలన్నీ ఆనవాళ్లను సైతం కోల్పోయాయంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.
నాలాలు కనుమరుగు
అయిదు శతాబ్దాల క్రితం పట్టణాన్ని పాలించిన రాజులు ఎంతో ముందుచూపుతో ఈ కందకాలను నిర్మించారు. వీటివల్ల కేవలం రక్షణకే కాకుండా నీటినిల్వ జరిగి తద్వారా భూగర్భజలాలు ఎక్కువయ్యేలా చర్యలు తీసుకున్నారు. వీటితో పాటు చుట్టూ ఉన్న గొలుసుకట్టు బావులతో పట్టణంలో నీటి వనరులు పుష్కలంగా ఉండేవి. భూగర్భజలాలు సైతం జిల్లాలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ ఎంతో మెరుగ్గా ఉండేవి. నీటినిల్వ ఉండే స్థలాలు కబ్జాలకు గురి కావడంతో భూగర్భంలోనూ నీరు ఇంకే పరిస్థితి కనిపించడం లేదు. కళ్లముందే ఆక్రమణలు జరుగుతున్నా అధికారులు అడ్డుకోలేకపోతున్నారు. నాలాలపై నిర్మాణాలతో పాటు ఆక్రమణలు పెరిగిపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి ఇళ్లలోకి నీరు చొరబడే పరిస్థితి ఏర్పడింది. అయితే ఆక్రమణలను తొలగించడం, అడ్డుకోవడం చేయాల్సిన అధికారులు, పాలకులు ఊధాసీనంగా వ్యవహరిస్తున్నారు. చిన్న కందకాలను, డ్రెయినేజీలను సైతం ఆనవాళ్లు లేకుండా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. మొక్కుబడిగా చిన్న చిన్న కాలువలు నిర్మించి చేతులు దులపుకొంటున్నారు. ఫలితంగా ఒకప్పుడు ఎంతో విశాలంగా కనిపించిన కందకాలు, నాలాలు నేడు ఆనవాళ్లను సైతం కోల్పోయి చిన్నవిగా దర్శనమిస్తున్నాయి.

పొంచి ఉన్న ముప్పు