
ఇరిగేషన్‌శాఖ ద్వారానే బ్రిడ్జి నిర్మించాలి : ఎంపీ
గద్వాల: జూరాల డ్యాం స్థితిగతులు, చేపట్టాల్సిన చర్యలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ముందుగానే వివరించినట్లు మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్రిడ్జి లేకపోవడంతోనే డ్యాంకు ఇబ్బందికరంగా మారిందన్నారు. అయితే ఆర్‌అండ్‌బీ శాఖతో హైలెవల్ బ్రిడ్జి మంజూరు చేయించడం వల్ల పనులు జరుగుతాయో లేదో అనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని తెలిపారు. ఇరిగేషన్‌శాఖ ద్వారానే బ్రిడ్జి నిర్మాణం చేపడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. జూరాల డ్యాం భద్రతను దృష్టిలో ఉంచుకొని హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా చేపట్టాలని కోరారు.
దశాబ్దాల పోరాట
ఫలితమే రిజర్వేషన్లు
అలంపూర్: మూడు దశాబ్దాలకు పైగా ఎమ్మార్పీఎస్ చేసిన పోరాటాల ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ కల సాకారమైందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా ఇన్‌చార్జి బుర్రి సతీశ్ మాదిగ అన్నారు అలంపూర్ మండలం కోనేరులో బుధవారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ వేడుకల సన్నాహాక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం మందకృష్ణ మాదిగ నేతృత్వంలో అలుపెరగని పోరాటం నిర్వహించినట్లు తెలిపారు. ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7న గ్రామగ్రామానా జెండా పండుగ నిర్వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం కోనేరు గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. ఎంఎస్‌ఎఫ్ పీయూ అధ్యక్షుడు మీసాల గణేశ్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కమలాకర్, మండల ఇన్‌చార్జి మద్దిలేటి, కో–ఇన్‌చార్జి జీవన్ పాల్గొన్నారు.
గట్టు ఎత్తిపోతలకు నిధులు కేటాయించండి
కేటీదొడ్డి: గట్టు ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం నిధులు కేటాయించి, పనులు త్వరగా పూర్తిచేయాలని తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాల్ డిమాండ్ చేశారు. బుధవారం కేటీదొడ్డిలో ఆయన రైతులతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. గట్టు, కేటీదొడ్డి మండలాల్లో రైతులు సాగునీటి వసతికి నోచుకోక అవస్థలు పడుతున్నారని అన్నారు. వందలాది ఎకరాలు బీడుగా మారాయన్నారు. గట్టు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేస్తే 33వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గట్టు ఎత్తిపోతలకు నిధులు కేటాయించాలని కోరారు. ప్రభుత్వానికి యాసంగి సన్నరకం వరిధాన్యాన్ని విక్రయించిన రైతులకు బోనస్ అందించాలని డిమాండ్ చేశారు.
సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త
గద్వాల క్రైం: అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్, సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ విభాగం సీఐ రాజు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు సాంకేతిక పరిజ్ఞానంతో బ్యాంక్ ఖాతాదారులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారన్నారు. బంధువులు, అధికారులు, బ్యాంక్ సిబ్బందిగా ఖాతాదారులను నమ్మించి.. ఖాతాలోంచి డబ్బులు అపహరిస్తున్నట్లు తెలిపారు. మొబైల్ ఫోన్‌కు గుర్తుతెలియని వ్యక్తులు పంపించే లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదని సూచించారు. అత్యవసర సమయంలో 1930 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో సిబ్బంది రాజు పాల్గొన్నారు.

ఇరిగేషన్‌శాఖ ద్వారానే బ్రిడ్జి నిర్మించాలి : ఎంపీ

ఇరిగేషన్‌శాఖ ద్వారానే బ్రిడ్జి నిర్మించాలి : ఎంపీ