
గట్టు.. ముందడుగు
గట్టు: దేశ వ్యాప్తంగా వెనుకబడిన మండలాలను గుర్తించి, వాటి అభివృద్ధికి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు సాగేందుకు కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. ఇదే క్రమంలో దేశ వ్యాప్తంగా 500 మండలాలను గుర్తించి, వాటి అభివృద్ధికి పక్కా ప్రణాళిక ప్రకారం అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈమేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గట్టు, నర్వ మండలాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మండలాల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను అమలు పరుస్తున్నారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన ర్యాంకుల్లో గట్టు ఆస్పిరేషన్ బ్లాక్ దేశంలోనే 5వ ర్యాంకు సొంతం చేసుకుంది. దీని ఫలితంగా నీతి ఆయోగ్ ద్వారా కేంద్రం ప్రభుత్వం గట్టు మండలానికి రూ.కోటి నజరానాను ఇవ్వనున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు.
నిత్యం సమీక్షిస్తూ.. ప్రగతి దిశగా అడుగులు
గట్టు ప్రాంతాన్ని ఆస్పిరేషన్ బ్లాక్‌గా గుర్తించి, ప్రతి మూడు మాసాలకు ఒక సారి అన్ని శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తూ, అభివృద్ధిపై సూచనలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. 5 అంశాలపై 39 కీలక పనితీరును సూచికల ఆధారంగా నిర్ణయించారు. ఆరోగ్యం, పోషణ, విద్య, వ్యవసాయం, అనుబంధ సేవలు, ప్రాథమిక మౌలిక సదుపాయాలు, సామాజిక అభివృద్ధి అంశాలపై అధికారులు సమన్వయంతో సమీక్షలను నిర్వహిస్తూ, ఎప్పటికప్పుడు వాటి పని తీరులో ప్రగతి సాధించే దిశగా అడుగులు ముందుకు వేస్తూ సాగారు. అనుకున్నట్లే పడ్డ కష్టానికి దేశ వ్యాప్తంగా 5వ ర్యాంకును సాధించి, అందరి దృష్టి గట్టు వైపు మళ్లేలా ఇక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేశారు. గర్భిణులు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించే విధంగా చర్యలు, పోషకలోపం ఉన్న వారు లేకుండా చేయడం, వైద్య సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకునే విధంగా క్షేత్ర స్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు కృషి చేశారు. చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ, రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, భూసార పరీక్షలు చేయడం, కలెక్టర్ ప్రత్యేక చొరవ కారణంగా ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో వందశాతం ఫలితాల సాధించగలిగాయి. అదేవిధంగా, భవిష్య భారత్ స్వచ్చంద సంస్థ 12 గ్రామాలను దత్తత తీసుకుని కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. అంగన్‌వాడి కేంద్రాలను ఆధునికరించారు. రైతులకు చెక్ డ్యాంల నిర్మాణం, చెరువుల పునరుద్దరణ, పశువుల పోషణ, వైద్య సేవలు, విద్యార్థులకు కంటి పరీక్షలు సేంద్రీయ వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించి ప్రగతిలో పాలుపంచుకున్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లో 2వ స్థానం
దేశ వ్యాప్తంగా గుర్తించబడిన వెనుకబడిన మండలాల్లో దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను కలిపి కేంద్ర ప్రభుత్వం జోన్–3గా గుర్తించింది. జోన్–3లో గట్టు అభివృద్ధి సూచికలో 2వ ర్యాంకును సాధించింది. 2024లో గట్టును ఆస్పిరేషన్ బ్లాక్‌గా గుర్తించారు. అప్పటి నుంచి అధికారులు ప్రత్యేక దృష్టిని సారించి, శాఖల వారీగా ప్రగతి సాధనకు కృషి చేశారు. గట్టు ఆస్పిరేషన్ బ్లాక్ 2025లో జనవరి నుంచి మార్చి వరకు త్రైమాసికంలో 61.24 నుంచి 69.43కు పెరిగి 8.19 శాతం వృద్ధిని సాధించినట్లు కలెక్టర్ ప్రకటించారు.
ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రాంలో జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు
నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్‌కు మండలం ఎంపిక
ఐదు విభాగాల్లో ఉత్తమ ప్రగతి
కేంద్రం నుంచి రూ.కోటి వరకు సమకూరనున్న నిధులు
నిరంతర పర్యవేక్షణతోనే..
ఆస్పిరేషన్ బ్లాక్‌లో ప్రతి మూడు నెలలకు ఒక సారి సమీక్షించుకుని ముందుకు సాగడం ద్వారా అనుకున్న మేరకు లక్ష్యాన్ని చేరుకోగలిగాం. ముఖ్యంగా కలెక్టర్ ప్రతి నెలా శాఖల వారిగా ప్రగతి వివరాలను తెలుసుకుంటూ మమ్మల్ని ప్రోత్సహించారు. భవిష్యభారత్ స్వచ్ఛంద సంస్థ సహకారం ఎంతో ఉంది. మరింత బాధ్యతతో ముందుకు సాగుతాం.
– అప్జల్, జిల్లా నీతి ఆయోగ్ కోఆర్డినేటర్
కలెక్టర్ ఆదేశాలతోనే..
కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాం. అనుకున్న విధంగా ప్రగతి సాధనలో కృషి ఫలిచింది. దేశ స్థాయిలో గట్టుకు గుర్తింపు రావడం సంతోషాన్ని కల్గించింది. మరింత బాధ్యతతో ముందుకు సాగుతాం.
– చెన్నయ్య, ఎంపీడీఓ, గట్టు

గట్టు.. ముందడుగు

గట్టు.. ముందడుగు

గట్టు.. ముందడుగు