
కార్మిక ఉద్యమ చరిత్రలో సముచిత స్థానం
గద్వాల న్యూటౌన్: భారత కార్మికోద్యమ చరిత్రలో ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) సముచిత స్థానాన్ని దక్కించుకుందని గద్వాల బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి బంగి రంగారావు అన్నారు. మంగళవారం స్థానిక ఎల్‌ఐసీ కార్యాలయంలో ఏఐఐఈఏ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కఠినమైన పరిస్థితుల మధ్య ఏఐఐఈఏ ఆవిర్భవించి, విశాలమైన ప్రయోజనాలను సాధించిందని చెప్పారు. 74 ఏళ్ల అప్రతిహాస ప్రయాణాన్ని పూర్తి చేసుకొని, ప్లాటినం జూబ్లీ వసంతంలోకి అడుగుపెట్టిందన్నారు. ఎల్‌ఐసీ జాతీయీకరణకు కారణమవడమే కాకుండా ఎల్‌ఐసీ అద్భుత పురోగతి, అభివృద్ధికి చోదక సాధనంగా ఉపయోగపడిందన్నారు. దేశంలోని ఇన్సూరెన్స్ రంగంలో ప్రైవేట్ ప్రాబల్యం ఉండకూడదు అన్న నినాదాన్ని అహర్నిశలు ప్రచారం చేస్తూనే వస్తోందన్నారు. ఎల్‌ఐసీ ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం అహర్నిషలు ఏఐఐఈఏ కృషి చేస్తోందన్నారు. అంతకుముందు అసోసియేషన్ జెండాను అధ్యక్షుడు వంటి సూరజ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో క్లాస్ 3, క్లాస్ 2 , క్లాస్ వన్ ఉద్యోగులు, ఏజెంట్లు పాల్గొన్నారు.
మామిడి సాగులో
కొమ్మ కత్తిరింపులు కీలకం
గద్వాల వ్యవసాయం: మామిడి సాగులో కొమ్మ కత్తిరింపులు కీలకమని, దీనికి జూన్, జులై నెలలు అనువైనవని జిల్లా ఉద్యానశాఖ అధికారి అక్బర్ పాష ఒక ప్రకటనలో సూచించారు. మామిడి పంట సమృద్ధిగా పండాలంటే ప్రతి ఏడాది మామిడి కోత అనంతరం చెట్టుకు 15 రోజులు విశ్రాంతి ఇచ్చి, కొమ్మలు కత్తిరించాలని, ఇలా చేయడం వల్ల చెట్టు లోపలికి గాలి, వెలుతురు, సూర్యరశ్మి సోకి మంచి కాపు వస్తుందని తెలిపారు. చెట్ల నుంచి కాయలు కోసిన తర్వాత మిగిలిన తొడమలను కత్తిరించాలని, ఎండు, చీడపీడలు ఆశించిన కొమ్మలను మొదటి వరకు కత్తిరించి కొనలకు బోర్డో మిశ్రమాన్ని లేదా కాపర్ యాక్సిక్లోరైడ్‌ను పూ యాలని తెలిపారు.
అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
గద్వాలటౌన్: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల కోసం మంగళవారం స్థానిక ఇండోర్ స్టేడియంలో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు జరిగాయి. బాలుర, బాలికలకు పరుగు పందెంతో పాటు లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌ఫుట్, జావలిన్‌త్రో విభాగాలలో 350 మంది విద్యార్థులు పోటీపడ్డారు. డీవైఎస్‌ఓ జితేందర్ జెండా ఊపి పోటీలను ప్రారంభించారు.
వేరుశనగ క్వింటా రూ.5,752
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌కు 660 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ. 5,752 కనిష్టం రూ.3,229 ధరలు పలికాయి.