
మత్తు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
గద్వాలటౌన్: మత్తు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పాటుపడాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన 2కె ర్యాలీని ఎస్పీ శ్రీనివాస్‌రావుతో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. పట్టణ ప్రధాన రహదారుల వెంట సాగిన ర్యాలీలో విద్యార్థులు, అధికారులు, పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంపై మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలను వివరిస్తూ ప్రజల్లో అవగాహన తీసుకురావాలని సూచించారు. విద్యా సంస్థలలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిరోధక కమిటీలను బలోపేతం చేయాలన్నారు. డ్రగ్స్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు యువత నడుం బిగించాలన్నారు. ఎస్పీ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగాస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. యువత డ్రగ్స్ బారినపడి, తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా స్థాయిలో పోలీసుశాఖ మాదక ద్రవ్యాల వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు సునంద, సిద్దప్ప, డీఎస్పీ మొగులయ్య పాల్గొన్నారు.