ఆర్టీసీ బాదుడు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బాదుడు

Jun 23 2025 5:50 AM | Updated on Jun 23 2025 5:50 AM

ఆర్టీ

ఆర్టీసీ బాదుడు

కిలోమీటర్ల రౌండప్‌ చార్జీలతో అదనపు భారం

నారాయణపేట రూరల్‌: మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగగా అందుకు సరిపడా బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. జీరో టికెట్‌ మీద ప్రయాణించే అతివలు సైతం కనీసం నిల్చొనే చోటు లేక ఇక్కట్లు పడుతుండగా.. ఇక డబ్బులు పెట్టి ప్రయాణం చేస్తున్న పురుషుల సంగతి సరేసరే. ఈ తరుణంలో పాఠశాల, కళాశాలలకు చదువుకునేందుకు వెళ్తున్న విద్యార్థులు, ఉద్యోగ, వ్యాపారాలకు రెగ్యులర్‌ ప్రయాణం చేస్తున్నవారు, ఇతర ప్రయాణికులు ఆర్టీసీ యాజమాన్యం అంతర్గతంగా జారీ చేసిన ఆదేశాలతో స్థానిక అధికారులు పెంచిన చార్జీలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు కొందరు పురుష ప్రయాణికులు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు.

సర్దుబాటు, టోల్‌ ప్లాజా పేర్లతో..

ఆర్టీసీలో పల్లె వెలుగు బస్సుల టికెట్‌ ధరలు కిలోమీటర్ల రౌండ్‌ ఫిగర్‌తో నిర్ణయించబడి ఉంటుంది. అయితే ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులో మాత్రం సరిగ్గా కిలోమీటర్‌కి లెక్కించి టికెట్‌ ధర నిర్ణయిస్తారు. అయితే గతంలో చిల్లర సమస్య పేరుతో టికెట్‌ ధరలను రౌండప్‌ పేరుతో పెంచారు. తాజాగా మరోసారి కిలోమీటర్లను సర్దుబాటు చేస్తున్నామనే పేరుతో రూ.10 పెంచేశారు. దీంతో ప్రతి ప్రయాణికుడిపై అదనపు భారం పడనుంది. దీనికితోడు టోల్‌గేట్‌ దాటి ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు అదనంగా మరో రూ.10 చెల్లించాల్సి వస్తుంది. దీంతో ఆయా మార్గాల్లోని ప్రయాణికులపై గరిష్టంగా రూ.20 భారం పడినట్లయ్యింది.

నెలవారి విద్యార్థి పాసుల పెంపు ఇలా..

2024– 25లో ఇచ్చిన బస్‌పాస్‌ల వివరాలిలా..

టోల్‌గేట్‌ దాటితే మరో రూ.10 వడ్డింపు

మహిళలకు ఉచిత ప్రయాణంతో తీవ్రమైన ఇబ్బందులు

ఇప్పటికే సీట్లు దొరకక పురుష ప్రయాణికుల అసహనం

తాజాగా ధరల పెంపుతో మరింత పెరిగిన అయిష్టత

ఇష్టారీతిగా పెంచడం సరికాదు

గతంలో చిల్లర సమస్య పేరుతో చార్జీలను రౌండ్‌ ఫిగర్‌ చేసి భారం మోపిన ఆర్టీసీ తాజాగా కిలోమీటర్లను రౌండ్‌ ఫిగర్‌ చేస్తున్నట్లు అసంబద్ధంగా ఇష్టారీతిగా చార్జీలు పెంచడం సరికాదు. ప్రతి టికెట్‌పై రూ.10, టోల్‌గేట్‌ దాటితే అదనంగా మరో రూ.10 వసూలు చేస్తున్నారు. సీజన్‌ పాస్‌ నెలకు మరో రూ.400 చెల్లించాల్సి వస్తుంది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. – సందీప్‌,

ప్రయాణికుడు, నారాయణపేట

పేద విద్యార్థులపై ఆర్థిక భారం..

ఉన్నత విద్యను అభ్యసించాలని ఆర్టీసీ బస్సుల్లో పట్టణాలకు వచ్చే పేద, మధ్య తరగతి విద్యార్థులపై ఆర్థిక భారం మోపడం సరికాదు. రూ.75 నుంచి ఏకంగా రూ.275 చొప్పున నెలవారి రాయితీ పాసుల ధరలను పెంచడం ఆయా కుటుంబాలకు మోయలేని భారంగా మారుతుంది. బాలురకు సైతం ఉచితంగా పాసులు అందించి ఆదుకోవాలి. – నరేష్‌, ఏబీవీపీ

జిల్లా కన్వీనర్‌, నారాయణపేట

20 రోజుల చార్జీతో..

ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ప్రయాణించే నెలవారీ రూట్‌పాస్‌ చార్జీలను సైతం ఆర్టీసీ పెంచింది. 20 రోజుల చార్జీతో నెల రోజులపాటు ప్రయాణం చేయడానికి అందించే సీజన్‌ పాసులపై రూ.400 అదనంగా వసూలు చేయనున్నారు. ఇక 12 సంవత్సరాలు నిండిన బాలురకు పల్లె వెలుగు బస్సుల్లో అందించే రాయితీ బస్‌ పాస్‌ ధరలను సైతం అమాంతం పెంచారు. 5 కిలోమీటర్ల నుంచి 35 కిలోమీటర్ల మధ్య విద్యార్థి ఇంటి నుంచి విద్యాసంస్థ వరకు ప్రయాణం చేస్తారు. దీనికి రూ.150 నుంచి మొదలయ్యే పాస్‌ ధర కనిష్టంగా నెలకు రూ.75 నుంచి గరిష్టంగా రూ.275 వరకు ఉంది.

స్వల్పంగా పెరిగింది..

ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ నెలలో టోల్‌గేట్‌ ధరలను పెంచుతుంది. ఈ క్రమంలో ఆర్టీసీ అందుకు అనుగుణంగా ప్రయాణికుల టికెట్‌పై ఆ భారాన్ని సరిచేస్తారు. ఈసారి కొంత ఆలస్యంగా వాటిని అమలు చేశాం. ఇక పల్లె వెలుగు మాదిరి ఎక్స్‌ప్రెస్‌ బస్సులకు సైతం రౌండప్‌ కిలోమీటర్లకు టికెట్‌ ధరను సరిచేయడంతో కొన్ని స్టేజీలకు టికెట్‌పై స్వల్పంగా ధర పెరిగింది.

– సంతోష్‌కుమార్‌, రీజినల్‌ మేనేజర్‌, మహబూబ్‌నగర్‌

ఆర్టీసీ బాదుడు 1
1/4

ఆర్టీసీ బాదుడు

ఆర్టీసీ బాదుడు 2
2/4

ఆర్టీసీ బాదుడు

ఆర్టీసీ బాదుడు 3
3/4

ఆర్టీసీ బాదుడు

ఆర్టీసీ బాదుడు 4
4/4

ఆర్టీసీ బాదుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement