నీటిని ఆపేదెలా..? | - | Sakshi
Sakshi News home page

నీటిని ఆపేదెలా..?

Jun 23 2025 5:50 AM | Updated on Jun 23 2025 5:50 AM

నీటిన

నీటిని ఆపేదెలా..?

నీటి ప్రవాహం ఉన్నా స్టోరేజీకి చోటు లేని వైనం

రాజోళి: నిండా నీరున్నా వాడుకోలేని దుస్థితి జిల్లాలోని ఆర్‌డీఎస్‌ ఆయకట్టు పరిదిలో నెలకొంది. గతంలో కర్ణాటక పరిదిలో నుంచి వచ్చే ఆర్‌డీఎస్‌ కెనాల్‌ నీటిపై ఆధారపడిన రైతులకు ప్రస్తుతం దాంతో పాటుగా తుమ్మిళ్ల లిఫ్టు నుంచి వచ్చే నీరు కూడా తోడు కావడంతో కొద్దిగా ఊరట కలిగిందని ఆశించారు. కానీ ఆ ప్రయోజనం తాత్కాలికంగానే ఉపశమనిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి సీజన్‌లో తుమ్మిళ్ల లిఫ్టుపై ఆశలు పెట్టుకుంటే.. అది అక్కరకు రాకపోవడంతో పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిసే సమయంలో నీటిని విడుదల చేస్తే దాని వల్ల ఎవరికి ప్రయోజనమని ప్రశ్నిస్తున్నారు.

సరైన సమయంలో ప్రశ్నార్థకంగా..

తుమ్మిళ్ల లిఫ్టు ద్వారా రైతులకు తాత్కాలిక ప్రయోజనమే కలుగుతుంది. తుంగభద్ర నదిలో వరద ఉన్న సమయంలోనే తుమ్మిళ్ల లిఫ్టు ద్వారా నీటిని తీసుకునే అవకాశముంటుంది. కానీ అదే సమయంలో వర్షాలు కురుస్తుంటాయి. ఆ నీటిని రైతులు ఏం చేసుకోవాలో తెలియని దుస్థితి. అదే స్టోరేజీకి అవకాశముంటే, వర్షాలు కురుస్తున్న సమయంలో, వర్షపు నీటిని, నదిలో ఉన్న వరదను నిలుపుకుని రైతులకు నీరు లేని సమయంలో విడుదల చేస్తే ఆయకట్టుకు శాశ్వత ప్రయోజనం అందించే వీలుంటుంది. అయినా కూడా దాని వైపు అధికారులు అడుగులు వేయడం లేదు. ప్రస్తుతం సీజన్‌ మొదలు కావడంతో ఎగువ నుంచి వచ్చే నీటిని ఏ రకంగా ఒడిసి పట్టుకునే అవకాశం లేకపోవడంతో తుమ్మిళ్ల లిఫ్టు అందించే ప్రయోజనం తాత్కాలిక ఉపశమనంగానే మారుతుంది. వర్షాలు కురిస్తే రైతులకు ఆర్‌డీఎస్‌ నీరు ఎక్కువగా అవసరం ఉండకపోవడంతో, ఆ సమయంలో అధికారులు తుమ్మిళ్ల మోటార్లు కూడా ఆన్‌ చేయరు. కానీ అప్పటికే సుంకేసుల డ్యాం ద్వారా వందల టీఎంసీల నీరు దిగువకు వెళ్తుంది. వర్షాలు లేని సమయంలో ఆర్‌డీఎస్‌కు నీరు అందించేందుకు తుమ్మిళ్ల మోటార్లకు సరిపడే నీరు నదిలో లేకపోవడంతో ఆర్‌డీఎస్‌ ఆయకట్టుకు నీరు అందక పంటలు ఎండుముఖం పడుతున్నాయి. ఆ పరిస్థితి రాకుండా చర్యలు చేపడతారనుకుంటే ఈ ఏడాది కూడా నీటిని కాపాడుకోలేకపోతున్నామని ఆర్‌డీఎస్‌ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతేడాది తుమ్మిళ్ల లిఫ్టు ద్వారా ఆర్‌డీఎస్‌ కెనాల్‌కు విడుదల అవుతున్న నీరు

ఈ ఏడాది కూడా స్టోరేజీ లేదు..

నీరున్నా.. వాడుకోలేకున్నాం

సుంకేసుల డ్యాం దిగువకు ప్రతి ఏటా వందల టీఎంసీల నీరు తుంగబద్ర నది నుంచి తరలిపోతున్నాయి. నది చెంతనే ఉన్న ఆర్‌డీఎస్‌ రైతులకు మాత్రం పూర్తి స్థాయిలో నీరు అందడం లేదు. తుమ్మిళ్ల లిఫ్టు వచ్చాక రైతులకు కొంత ఊరట లభించినప్పటికీ, నదిలో ఉన్న వరద నీటిని ఒడిసిపట్టుకునే రిజర్వాయర్లే ప్రశ్నార్థకంగా మారాయి. దీని వల్ల నీటిి వసతి ఉన్నా జిల్లా రైతులు వాడుకోలేకపోతున్న దుస్థితి నెలకొంది. – శ్రీను, రైతు, పచ్చర్ల

కష్టకాలంలో పంటలను కాపాడుకోవచు్చ

తుంగభద్ర నది నిండుగా ప్రవహిస్తుంటుంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తుంటాయి. అదే సమయంలో తుమ్మిళ్ల లిఫ్టు ద్వారా నీటిని వదిలితే రైతులకు ప్రయోజనం ఏముంటుంది. అదే వరద నీటిని, వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని నిల్వ చేసుకుంటే పంటలు ఎండే సమయంలో, ఎగువ నుంచి ఆర్‌డీఎస్‌ కెనాల్‌కు నీరు రాని సమయంలో నీటిని అందించి పంటలను కాపాడుకోవచ్చు.

– బానుప్రసాద్‌, రైతు, శాంతినగర్‌

మల్లమ్మకుంటపై నీలినీడలు

గతేడాది సుంకేసుల నుంచి 300 టీఎంసీలు దిగువకు

కేసీ కెనాల్‌కు 35 టీఎంసీలు

తుమ్మిళ్ల లిఫ్టు ద్వారా వాడింది 3.529 టీఎంసీలు మాత్రమే..

ప్రతి ఏటా రైతులకు తప్పని సాగునీటి కష్టాలు

తుమ్మిళ్ల లిఫ్టులో ప్రధానమైన రిజర్వాయర్లు లేకపోవడంతో నీటి వృథా జరుగుతుంది. వందల టీఎంసీలు సుంకేసుల నుంచి దిగువకు వెళ్తున్నాయంటే, బ్యాక్‌ వాటర్‌ నిలిచే తుమ్మిళ్ల దగ్గర ఎంత స్థాయిలో వరద ఉంటుందో అందరికి తెలిసిందే. కానీ ఆ వరద నీటిని ఒడిసి పట్టుకొనే సౌక్యరాలు లేక నీటిని దిగువకు వదిలేయాల్సి వస్తుంది. లిఫ్టు ప్రారంభమైనప్పటి నుండి కేవలం మోటార్లు రన్‌ చేసి నీటిని నేరుగా ఆర్‌డీఎస్‌ కెనాల్‌లోకి విడుదల చేస్తున్నారే తప్పా నీటిని నిల్వ చేసుకునేందుకు చర్యలను వేగవంతం చేయడం లేదనే వాదన ఆర్‌డీఎస్‌ రైతులు వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్ల నిర్మాణంపై విభిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్న నేపథ్యంలో మల్లమ్మకుంట రిజర్వాయర్‌ పనులు వేగంగా చేపట్టాల్సింది ఉండగా.. దానిపై ప్రస్తుతం నీలి నీడలు కమ్ముకోవడంతో రైతుల్లో నైరాశ్యం నెలకొంది.

నీటిని ఆపేదెలా..? 1
1/2

నీటిని ఆపేదెలా..?

నీటిని ఆపేదెలా..? 2
2/2

నీటిని ఆపేదెలా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement