
వందల టీఎంసీలు దిగువకు..
గతంలో సుంకేసుల డ్యాం నుంచి దిగువకు, కేసీ కెనాల్ ద్వారా కర్నూల్‌తో పాటు ఏపీలోని ఇతర జిల్లాల ఆయకట్టుకు నీరు అందుతుండగా నది పక్కనే ఉన్నా కూడా జిల్లాలో ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. ఈ కష్టాలను తప్పించేందుకు తుమ్మిళ్ల ఎత్తిపోతల నిర్మాణం చేపడితే ఆ ప్రాజెక్టు కూడా పూర్తి కాకపోవడం, రిజర్వాయర్ల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారడంతో రైతులు ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తుమ్మిళ్ల లిఫ్టు లేనందుకు నీరు సుంకేసుల, కేసీ కెనాల్ ద్వారా దిగువకు పోతున్నాయన్న నాయకులు.. ప్రస్తుతం సుంకేసులకు ఎగువన బ్యాక్ వాటర్ ఉండే తుమ్మిళ్ల దగ్గర లిఫ్టు ఏర్పాటు చేస్తే దాని వల్ల నీరు స్టోరేజీ చేసుకోలేకపోతున్నామని, దీని వల్ల వందల టీఎంసీల నీరు ఇప్పటీకి దిగువకు వెళ్తున్నాయని అంటున్నారు. గత ఏడాది (జూన్ 2024 నుంచి మార్చి 2025)వరకు ఎగువ ఉన్న ప్రాజెక్టుల నుంచి వచ్చిన నీటిని తుమ్మిళ్ల మీదుగా సుంకేసుల డ్యాం నుంచి 300 టీఎంసీల నీటిని దిగువన ఉన్న శ్రీశైలంకు విడుదల చేశారు. డ్యాంకు అనుసంధానంగా ఉన్న కేసీ కెనాల్ నుంచి 35 టీఎంసీల నీటిని కర్నూల్ తదిదర జిల్లాల ఆయకట్టుకు అందించారు. బ్యాక్ వాటర్ నిలిచి ఉండే తుమ్మిళ్ల ద్వారా కేవలం 3.529 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.