
యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం
గద్వాలటౌన్: చిన్నా, పెద్దా తేడా లేకుండా ఉదయం ఆరు గంటలకు ముందే యోగా సాధనకు తరలివచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం యోగా శిక్షణకు హాజరై స్ఫూర్తి కలిగించారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయుష్ విభాగం, వైద్య ఆరోగ్యశాఖ, పతంజలి యోగ సమితి, భారత్ స్వాభిమాన్ ట్రస్టు, కలెక్టరేట్ కార్యాలయం, గద్వాల లయన్స్ క్లబ్, గద్వాల వాకర్స్ గ్రూప్, స్మృతివనం సభ్యులు, సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో వేరువేరుగా ఆయా ప్రాంతాలలో నిర్వహించిన యోగా శిక్షణ శిబిరం ఉత్సాహంగా సాగింది.
● కలెక్టరేట్ కార్యాలయంలో, స్మతివనంలో జరిగిన యోగా దినోత్సవంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మినారాయణ పాల్గొని అధికారులు, ఉద్యోగులతో కలిసి యోగాసనాలు వేశారు. బీజేపీ నాయకులు, ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో స్థానిక కోటలోని చెన్నకేశవస్వామి ఆలయ ఆవరణలో పురుషులు, మహిళలు యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.
● ధరూర్‌లో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్మృతివనంలో మహిళలు, వాకర్స్ పెద్ద సంఖ్యలో హాజరై యోగాసానాలు వేశారు. క్రీడల సమాఖ్య ఆధ్వర్యంలో క్రీడాకారులు యోగా శిక్షణ శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యోగ శిక్షణ ఇచ్చారు. వీటితో పాటు పలు విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు వారి వారి పరిధిలో యోగా శిబిరాలు నిర్వహించారు.
●పలువురు శిక్షకులు యోగాపై మెలకువలు వివరించారు. రుగ్మతలను దూరం చేసే ఆసనాలు.. ప్రశాంతతను చేకూర్చే ప్రాణాయామం.. మనస్సును నియంత్రించే ధ్యాస.. ధ్యానం సాధనలతో జిల్లా వాసులు ఉషోదయాన సేదతీరారు. శిక్షకులు వివిధ రకాల ఆసనాలను ప్రదర్శించి ఆరోగ్యానికి అవి ఎలా.. ఉపయోగపడతాయో సవివరంగా తెలియజేశారు. ఔత్సాహికులచే ఆసనాలు వేయించారు. యోగా ప్రాముఖ్యతను వివరించడంతో పాటు.. ఈ క్రమంలోనే ప్రాథమికంగా యోగా శిక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువలను వివరించారు. సుమారు రెండు గంటల పాటు యోగా సాధన చేశారు. ఇలాంటి కార్యక్రమాలు నిత్యం కొనసాగేలా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు చర్యలు తీసుకోవాలని ఔత్సాహికులు కోరారు. యోగా నిత్య జీవితంలో భాగం కావాలని సూచించారు.
ఉత్సాహంగా యోగా శిక్షణ
జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
యోగాతో మానసిక ఒత్తిడి దూరం..
గద్వాల క్రైం: మానసిక ఒత్తిళ్లు.. నిలకడ లేని ఆలోచనల నుంచి బయటపడాలంటే యోగాతోనే సాధ్యమవుతుందని జిల్లా జడ్జి ఎన్ ప్రేమలత, ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లా కోర్టు, పోలీసు పరేడ్ గ్రౌండ్ ఆవరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరు తీవ్ర వేదన, చిరాకు, ఒత్తిళ్లు, ఆందోళనకు కుంగిపోతున్నారన్నారు. స్థిరత్వం లేని ఆలోచనలు, క్షణికావేశంతో చేస్తున్న పొరపాటు ద్వారా సమస్యలకు నిలయంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రతి జఠిలమైన సమస్యల నుంచి విజయం సాధించాలంటే క్రమం తప్పకుండా యోగా చేయాలన్నారు. మానసిక ప్రశాంతతా, ఆనందం, సమయానుకులంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, చేస్తున్న పనుల్లో సంతోషం ఉంటుందన్నారు. అన్ని వయస్సుల వారు యోగా చేయడం ఆరోగ్యదాయకమన్నారు.

యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం