
జోగుళాంబ సన్నిధిలో ప్రముఖుల ప్రత్యేక పూజలు
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తి పీఠమైన అలంపూర్ జోగుళాంబ ఆలయాలను ఎమ్మెల్యే విజయుడు చల్లా ఆగస్త్యారెడ్డి, హరిప్రసాద్ రెడ్డితో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు జోగుళాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు శేషవస్త్రాలతో సత్కరించారు. అలాగే, రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ రాయల నాగేశ్వర్‌రావు ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్ధ ప్రసాదాలను అందజేసి అశీర్వచనం పలికారు. వీరితోపాటు ఆలయ అధికారి చంద్రయ్య ఆచారి ఉన్నారు.
‘సదరం’ క్యాంపు
షెడ్యూల్ విడుదల
గద్వాల: జిల్లాలో దివ్యాంగులకు నూతన సర్టిఫికెట్లు, రెన్యూవల్ కొరకు సదరం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23వ తేదీ నుంచి జూలై 15వ తేదీవ వరకు నిర్వహించే క్యాంపుల్లో ముందస్తుగా మీ–సేవా కేంద్రాలలో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. బుకింగ్ చేసుకున్నవారు నిర్ణయించిన తేదీల్లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో హాజరు కావాలని తెలిపారు. హాజరు కాని వారిని తిరస్కరించనున్నట్లు, హాజరైన వారికి అదే రోజు సదరం సర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. జూన్ 23, 30, జూలై 2,5,7,9,14 తేదీల్లో శారీరక వికలత్వం గల వారికి, జూలై 1, 8, 15తేదీల్లో కంటి, శారీరక వికలత్వం గల వారికి, జూలై 3, 10 తేదీల్లో శారీరక మానసిక వికలత్వం, 4,11 తేదీల్లో చెవిటి, మూగ,శారీరక వికలత్వం గల వారికి క్యాంపులు నిర్వహిస్తున్నట్లు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
రైతుల ఖాతాల్లో రూ.206.70 కోట్లు జమ
గద్వాల: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుభరోసా పథకం కింద జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వరకు 1,57,250 మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాలో రూ.206.70కోట్లు నేరుగా జమ చేసినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ ప్రకటనలో తెలిపారు. రైతుభరోసా పథకం కేవలం ఆర్థిక సాయమే కాకుండా రైతుల భవిష్యత్‌పై ఆశను నింపే విధంగా తోడ్పడుతుందని తెలిపారు. వానాకాలం పంటల సాగుకోసం అవసరమైన పెట్టుబడి భారం నుంచి రైతులకు విముక్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. శనివారం సాయంత్రం వరకు జిల్లాలో అర్హులైన 1,57,250మంది రైతులకు ఎకరాకు రూ.6వేల చొప్పున రూ.206,70,04,561లను నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. మిగిలిన అర్హత గల రైతులకు త్వరలోనే సాయం అందుతుందని పేర్కొన్నారు.
చేనేత కార్మికులకు రుణమాఫీ
గద్వాల: చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చేనేతజౌళి శాఖ ఏడీ గోవిందయ్య ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో 1–4–2017 తేదీ నుంచి 31–3–2024వరకు రుణాలకు మాఫీ చేయుటకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పథకం మార్గదర్శకాల ప్రకారం ప్రొఫార్మా 1ఏ మరియు 1బీ బ్యాంకుల్లో నుంచి వచ్చిన మిగిలిన బ్యాంకులు మంజూరుకు సంబంధించిన ఉత్తర్వులు చేనేత శాఖ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. ఈనెల 24వ తేదీలోగా ఇవ్వాలని, బ్యాంకులు సమర్పించిన రుణ వివరాలను డీఎల్‌సీ అనుమతితో ఈనెల 28వ తేదీలోపు ఎస్‌ఎల్‌బీసీ కి సమర్పించబడునని, లేనిచో సంబంధిత బ్యాంకులు బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. చేనేత మరియు జౌళి శాఖ కార్యాలయం మెయిల్ అడ్రస్ jogulambadtex@gmail.com అని, బ్యాంకర్లు కార్మికుల రుణమాఫీ పథకానికి సహకరించాలని తెలిపారు.
26న జాబ్‌మేళా
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ఒకేషనల్ కళాశాలలో ఈ నెల 26న అప్రెంటిషిప్, జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు డీఐఈఓ కౌసర్‌జహాన్ తెలిపారు. శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో కో కన్వీనర్ నర్సింహులుతో కలిసి ఆమె మాట్లాడారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2023, 2024, 2025 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మేళాలో పాల్గొనవచ్చన్నారు. గురువారం ఉయదం 9 గంటలకు ప్రారంభమయ్యే మేళాలో వివిధ కంపెనీలు పాల్గొంటాయని చెప్పారు.