
తెలంగాణ బ్రాండ్‌గా తూర్పుజాతి పశుసంపద
● నల్లమల లోతట్టు ప్రాంతంలో మేలుజాతి పశువులు
● మన్ననూర్ గిత్తకు వందేళ్లకు పైగా చరిత్ర
● ఆదరణ కొరవడటంతో ప్రశ్నార్థకమవుతున్న మనుగడ
● ప్రభుత్వం నుంచి ప్రత్యేక గుర్తింపు కోసం ఎదురుచూపులు
నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలోని చెంచుపెంటల్లో ఉండే మేలుజాతి పశువులకు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. అటవీ మేతతో దృఢంగా ఉండటం.. 20–25 ఏళ్లపాటు వ్యవసాయ పనులు చేసే సామర్థ్యం వీటి సొంతం. అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని మద్దిమడుగు, ఇప్పలపల్లి, మారడుగు, ఉడ్మిళ్ల, చిట్లంకుంట, వంకేశ్వరం, పదర, లక్ష్మాపూర్, తిర్మలాపూర్, ఉప్పునుంతల, మాధవానిపల్లి, అమ్రాబాద్, మన్ననూర్, వట్టువర్లపల్లి, దోమలపెంట గ్రామాలతోపాటు మల్లాపూర్, అప్పాపూర్, ఈర్లపెంట, మేడిమొల్కల, ఆగర్లపెంట, పుల్లాయిపల్లి, సంగండిగుండాలు చెంచుపెంటల్లో ఈ పశుజాతి ఉంది. ఆయా గ్రామాల రైతులు వ్యవసాయంతోపాటు పశుపోషణ ప్రధాన వృత్తిగా ఎంచుకొని జీవనం సాగిస్తున్నారు.
మన్ననూర్ గిత్తగా నామకరణం..
2016 డిసెంబర్ 27న అమ్రాబాద్ మండలం లక్ష్మాపూర్ (బీకే)లో ఈ ప్రాంత రైతులతో కలిసి తెలంగాణ జీవ వైవిధ్య సంస్థతోపాటు వాన్సన్ స్వచ్ఛంద సంస్థ తూర్పుజాతి పశు ప్రదర్శన, పశు పెంపకందారుల సంఘం ఏర్పాటు చేశారు. ఆ రోజు నల్లమల అటవీ ప్రాంతంలోని పశుజాతికి మన్ననూర్ గిత్తగా నామకరణం చేశారు. అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామని అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. గతంలో ఒక్కో రైతుకు 100 నుంచి 300 వరకు పశువులు ఉండేవి. 50 వేలకుపైగా పశువులు ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం 15 వేల వరకు మాత్రమే ఉన్నాయి. ఏటేటా ఈ అరుదైన పశుజాతి తగ్గిపోతోంది. ఇది వరకు నల్లమల అటవీ ప్రాంతంలో స్వేచ్ఛగా పశువులను మేపుకొనేవారు. అటవీశాఖ నిబంధనలు, అభ్యంతరాలతో పశుగ్రాసం కొరత ఏర్పడి.. పశుపోషణ భారంగా మారి చాలామంది వీటిని వదులుకుంటున్నారు.
కోడే దూడలకు డిమాండ్..
వ్యవసాయ అనుబంధమైన పశుపోషణలో ఈ ప్రాంత రైతులు ప్రగతి సాధిస్తున్నారు. నల్లమల తూర్పు పశుసంపదకు తెలంగాణతోపాటు ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. కర్నూలు, గుంటూరు, నెల్లూరు, అనంతపూర్, రాయచూర్‌తోపాటు కోస్గి, కొడంగల్ రైతులు దశాబ్దాల కాలంగా మేలుజాతి కోడెలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారులు ఈ ప్రాంతంలో ఉంటూ పశువులను పరిశీలించి.. తమకు నచ్చిన వాటిని కొనుగోలు చేస్తారు. ప్రతి ఏటా దీపావళి తర్వాత జరిగే కురుమూర్తి జాతరలోనూ నల్లమల పశువులను అమ్ముతుంటారు. గతంలో జత గిత్తలకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ధర ఉండగా.. ప్రస్తుతం రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు పలుకుతోంది.