
ఆయకట్టుకు సాగునీరు
నేడు విడుదల చేయనున్న మంత్రి వాకిటి శ్రీహరి
అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఈ ఏడాది ముందస్తుగా వరద వస్తుండటంతో ఆయకట్టుకు సాగునీరు వదిలేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వరద నీరు వృథా చేయకుండా వానాకాలం పంటల సాగుకుగాను ఆయకట్టుకు ముందస్తుగా నీటిని వదలాలని నిర్ణయించిన అధికారులు ప్రభుత్వానికి విన్నవించడంతో జూరాల ప్రధాన ఎడమ కాల్వకు ఆదివారం నీరు వదిలేందుకు ముహూర్తం ఖరారు చేశారు. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి ఎడమ కాల్వకు నీటిని వదలనున్నారని.. ఇందుకుగాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రాజెక్టు అధికారులు వివరించారు. వానాకాలం పంటల సాగుకు ముందస్తుగా కాల్వకు నీటిని వదలడం జూరాల చరిత్రలో ఇదే మొదటిసారని ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
● గతేడాది యాసంగిలో ప్రాజెక్టులో నిల్వ నీటిమట్టం తక్కువగా ఉండటంతో తాగునీటి అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ఎడమ, కుడికాల్వ ఆయకట్టును కుదించి 35 వేల ఎకరాలకే పరిమితం చేసి అతి కష్టం మీద సాగునీరు అందించగలిగింది. దీంతో యాసంగి సాగుకు దూరమైన చివరి ఆయకట్టు రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం సన్నరకం వరికి బోసన్ చెల్లిస్తుండటంతో ఆయకట్టులో కేవలం ఆ పంట మాత్రమే సాగుకు ఆసక్తి చూపుతున్నారు.
100 కిలోమీటర్లు.. 85 వేల ఎకరాలు...
జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ ద్వారా సుమారు 100 కిలోమీటర్ల పొడవునా.. 85 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలతో పాటు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వరకు కాల్వ వెంట సాగునీరు పారనుంది. ఏటా రెండు పర్యాయాలు వరి సాగు చేసే రైతులు కొన్నేళ్లుగా యాసంగిలో వారబందీ విధానంలో నీటిని అందిస్తున్నారు.
జూరాల జలాశయానికి
కొనసాగుతున్న వరద
ఎడమ కాల్వ పరిధిలో 85 వేల ఎకరాలు