‘సీజనల్‌’పై అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

‘సీజనల్‌’పై అప్రమత్తం

Jun 21 2025 3:07 AM | Updated on Jun 21 2025 3:59 AM

వానాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు

పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా కలెక్టర్‌ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్యం, దోమల నివారణ, తాగునీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాం. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. జ్వరం తగ్గనట్లయితే వెంటనే సమీప ఆస్పత్రుల్లో రక్త పరీక్షలు చేయించుకోవాలి. ఎక్కడా మందుల కొరత లేకుండా ఏర్పాట్లు చేశాం. ప్రభుత్వ హాస్టల్స్‌, కార్యాలయాలలో పరిశుభ్రత, తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్త చర్యలు చేపడతాం.

– సిద్దప్ప, జిల్లా ఇన్‌చార్జ్‌ వైద్యాధికారి

గద్వాల క్రైం: వానాకాలం వచ్చేసింది.. చిన్నపాటి వర్షాలకు లోతట్టు ప్రాంతాలు.. డ్రైయినేజీలు.. మురుగుకుంటలు.. ఇంటి సమీప కుంటల్లో నీరు నిలిచి దోమల వృద్ధి అంతకంతకూ పెరిగే అవకాశం ఉంది. గతేడాది జిల్లాలో 31 డెంగీ కేసులు నమోదవడం.. మరెన్నో టైఫాయిడ్‌, మలేరియా కేసులు.. కొన్ని గ్రామాల్లో పదుల సంఖ్యలో ప్రజలు జ్వరాల భారినపడిన నేపథ్యంలో ఈ ఏడాది వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఎలాంటి సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.

అవగాహన కార్యక్రమాలు

జిల్లాలో సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. దోమతెరలు వాడాలని.. కాచి చల్లార్చిన నీరు తాగాలని.. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని.. నిల్వ నీటిని పారబోయాలని.. ప్రజలకు అవగాహన కల్పించేందుకు సర్వం సిద్ధం చేశారు. గద్వాల, మల్దకల్‌, మానవపాడు, కేటీదొడ్డి, గట్టు, ఇటిక్యాల, అలంపూర్‌, శాంతినగర్‌, రాజోళి తదితర మండలాల్లో షెడ్యూల్‌ రెడీ చేశారు. మరో వైపు కలెక్టర్‌ సంతోష్‌షకుమార్‌ వైద్య సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాదిలో నమోదైన కేసులు, ఎక్కువగా కేసులు నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ముందస్తు చర్యలు

సీజనల్‌ వ్యాధులు ప్రధానంగా కలుషిత నీరుతాగడం, దోమకాటుతోనే సంక్రమిస్తాయి. ఈ క్రమంలో జిల్లా అధికారులు ఈ రెండు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంది. ఈక్రమంలో నీరు కలుషితం కాకుండా ప్రతి శుక్రవారం డ్రైడే పాటిస్తూ, ఇంటి పరిసరాల్లో పరిశుభ్రతను పాటించాలని వివరిస్తున్నారు. బయటి ఆహారాలకు దూరంగా ఉండాల్సిందిగా సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని, వేడి ఆహారం తీసుకోవాలని, కాచి చల్లార్చిన నీరు తాగాలని పిలుపు నిస్తున్నారు. కూలర్లు, కొబ్బరిబోండాలు, పాత టైర్లు, పూలకుండీలు, డ్రమ్ములలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాల్సిందిగా అధికారులు చెబుతున్నారు.

టీహబ్‌లో రక్తపరీక్షలు..

రోగులకు పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ డయాగ్నోస్టిక్‌ హబ్‌ ద్వారా ప్రతి ఆరోగ్య కేంద్రం పరిధిలో రక్త నమూనాలను సేకరించి, టీ హబ్‌ వాహనం ద్వారా పరీక్షల కోసం తీసుకెళ్తున్నారు. పరీక్ష ఫలితాలను సంబంధిత వ్యక్తి మొబైల్‌కు సందేశం రూపంలో పంపిస్తున్నారు. దీంతో రోగికి మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌, చికున్‌గున్యా వంటి సీజనల్‌ వ్యాధులను త్వరగా నిర్ధారించి, వెంటనే చికిత్స అందించే అవకాశం ఏర్పడింది. జ్వర బాధితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైద్య శిభిరాలు ఏర్పాటు చేసేందుకు జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంది. దీంతోపాటు ప్రత్యేక బృందాలు, ఆశ కార్యకార్తలు గ్రామాల్లో పర్యటిస్తూ.. జ్వరం, ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి దగ్గర్లోని ఆసుపత్రిలో చికిత్సలు చేయిస్తున్నారు. కేసులు అధికంగా నమోదైతే ఆయా గ్రామాల్లోనే ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటుచేసి మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో వైద్యశాఖ చర్యలు చేపట్టింది.

2024లో జిల్లాలో

డెంగీ కేసుల వివరాలిలా..

మండలం కేసులు

గద్వాల 4

గద్వాల పట్టణం 3

మానవపాడు 1

ధరూరు 3

రాజోలి 2

గట్టు 2

అలంపూర్‌ 7

మల్దకల్‌ 4

అయిజ 2

ఇటిక్యాల 1

వడ్డేపల్లి 1

కేటీదొడ్డి 1

దోమలు వృద్ధి చెందకుండా..

పరిశుభ్రతపై ఊరూరా ప్రజలకు

అవగాహన

వ్యాధులు ప్రబలితే తక్షణమే

చికిత్స అందించేందుకు ఏర్పాట్లు

గతేడాది జిల్లాలో

31 డెంగీ కేసులు నమోదు

లోతట్టు, ఎక్కువ కేసులు నమోదైన

ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

‘సీజనల్‌’పై అప్రమత్తం 1
1/2

‘సీజనల్‌’పై అప్రమత్తం

‘సీజనల్‌’పై అప్రమత్తం 2
2/2

‘సీజనల్‌’పై అప్రమత్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement