
మురిసిన పెద్దధన్వాడ
రాజోళి: ఇథనాల్ చిచ్చు వద్దంటూ పోరాడిన రైతుల లోగిళ్లలో పచ్చ తోరణాలు గడపలకు పెనవేసుకున్నాయి. గురువారం రాజోళి మండలం పెద్దధన్వాడ గ్రామంలో ఏరువాక సంబరాలు అంబరాన్నంటాయి. గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తున్న రైతులు, 12 గ్రామాల ప్రజలు ఈ నెల 4న పెద్ద ఎత్తున ఫ్యాక్టరీ వద్దని తమ గొంతుకను వినిపించేందుకు వెళ్లిన నేపథ్యంలో చోటు చేసుకున్న ఘటనలు విధితమే. దీంతో 42 మందిపై కేసు నమోదు కాగా..12 మంది రైతులను 5వ తేదీన రిమాండ్‌కు తరలించారు. రైతులంతా ఉంటేనే పండుగ చేసుకోవాలంటూ.. ఈ నెల 11న చేసుకోవాల్సిన ఏరువాక పౌర్ణమి పండుగను గ్రామస్తులంతా బహిష్కరించారు. తాజాగా బుధవారం బెయిల్ మంజూరు కావడంతో గురువారం పండుగ నిర్వహించారు.
సంబురంగా రైతు పండుగ
ఏరువాక పౌర్ణమి అంటే నడిగడ్డలో అతి పెద్ద పండుగ. అందులోనూ రైతులు జరుపుకొనేది. పెద్దధన్వాడలో ఉదయం నుండే మహిళలు ఇళ్ల ముందు ముగ్గులు, వాకిళ్లను తోరణాలతో అలంకరించారు. పిండి వంటలను ఒకరి ఇంటి దగ్గరకు వెళ్లి తయారు చేసి, ఆ తర్వాత మరొకరి ఇంటికి వెళ్లి చేసుకుంటూ సరదాగా గడిపారు. మరోవైపు రైతులు తమ ఎద్దులను తీసుకొని తుంగభద్ర నదికి వెళ్లి స్నానాలు చేయించి, అందంగా అలంకరించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం సాగాలని ప్రత్యేకంగా పూజలు చేశారు. కుటుంబసభ్యులు అందరూ కలిసి వంటలను, తీసుకుని ఆలయానికి వెళ్లారు. సుంకులమ్మ తల్లి దేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. పిండి వంటలు, బక్షాలు,ఇతర నైవేద్యాలను సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. గ్రామంలో ఎలాంటి ఆటంకాలు, ప్రమాదాలు జరగకుండా చూడాలని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. గ్రామంలో వ్యవసాయం కోసం రైతులు ఇప్పటికే సేద్యాలు పూర్తి చేసుకోగా అనుకోకుండా జరిగిన పరిణామాల కారణంగా సాగు ఆలస్యమైంది. వాటిని అధిగమిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని రైతులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
పోలీస్ స్టేషన్‌కు రైతులు
ఇదిలాఉండగా, బెయిల్‌పై విడుదలైన రైతులు గురువారం రాజోళి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. వారు రిమాండ్‌కు వెళ్లే క్రమంలో వారి నుంచి పోలీసులు సెల్‌ఫోన్లు తీసుకోగా.. వాటి కోసం రాజోళి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. కానీ కేసు నమోదు చేసిన ఎస్‌ఐ జగదీశ్ బదిలీ కావడం, శాంతిగనర్ సర్కిల్ సీఐ టాటా బాబు బందోబస్తులో ఉండటంతో వారి ఫోన్లపై స్పష్టత రాలేదు. ఇదే విషయమై సీఐ టాటాబాబును ‘సాక్షి’ వివరణ కోరగా.. 12 మంది కండిషనల్ బెయిల్‌పై ఉన్నారని, వారి సెల్‌ఫోన్లపై విచారించి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
అంబరాన్నంటిన ఏరువాక సంబరం
పిండి వంటలతో సుంకులమ్మకు మొక్కులు చెల్లింపు
ఇథనాల్ ఘటనతో గతంలో ‘ఏరువాక’ బహిష్కరణ